హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎక్కడి తెలంగాణ… ఎక్కడికి పురోగమించింది… సంక్షేమంలో శిఖరాగ్రం ఎలా చేరింది… అచిర ప్రాయంలోనే అద్భుత పథకాలు ఎలా సాధ్యమవుతున్నాయి… ఇదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాలకులు, ప్రజల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. తెలంగాణలో ప్రధానంగా సామాజిక పింఛన్ల అందజేత రానున్న ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రచారాస్త్రాలుగా మారనున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ పథకాన్ని దేశమంతటా అమలు చేయ కుంటే తమ ఉనికికే ప్రమాదమనే పరిస్థితుల్లోకి జాతీయ పార్టీలు చేరుతున్నాయనే ఘంటికలు మ్రోగుతున్నాయి. సంక్షేమ పథంలో స్వర్ణయుగాన్ని తలపిస్తూ అన్ని వర్గాలకూ అండగా నిలు స్తున్న తెలంగాణ సర్కార్ వైపు దేశంలోని వృద్ధులంతా దృష్టి సారించారు. ఏ ఒక్క వర్గాన్ని వదల కుండా, ఎవరూ అడగని, డిమాండ్ చేయని వారికి కూడా సీఎం కేసీఆర్ అద్భుతంగా పింఛన్లతో అండగా నిలిచి పెద్ద కొడుకుగా మారిన తీరును జాతీయ స్థాయిలో ప్రజలు, పార్టీల నేతలు, రాజకీయ విమర్శకులు, విశ్లేషకులంతా గమనిస్తున్నారు. ఇదిలా ఉండగానే మరో విప్లవానికి నాందిగా ఇప్పటివరకు 65ఏళ్లు నిండిన వారికి వచ్చే ఆసరా పింఛన్‌ను 57 ఏళ్లు నిండిన అందరికీ వర్తింపజేశారు.
వీరందరికీ…
వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పేషెంట్లకు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ.2116, దివ్యాంగులకు రూ.3116లను ప్రభుత్వం పింఛన్‌గా అందిస్తోంది. దరఖాస్తుదారుల పేర్లమీద మెట్టభూమి 7.5ఎకరాలు, మాగాణి 3 ఎకరాలకు మించి ఉండరాదని నిబంధన ఉంది. కుటుంబ వార్షిక ఆదాయం కూడా గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2 లక్షలుగా ఉంది.
ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటిదాకా…
ఏపీలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో వృద్ధాప్య పింఛన్ రూ.200 మాత్రమే ఉండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి ఒకేసారి రూ.2116కు పెంచారు. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి భారీ ఆసరా పథకం లేకపోగా జాతీయ స్థాయిలో కేంద్ర పాలక ప్రభుత్వాలు ఇటువంటి ఉచితాలు వద్దంటూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశాయి. వేటినీ పట్టించుకోని సీఎం కేసీఆర్ స్వయం సమృద్ధి, స్వయం పాలన, ఆత్మగౌరవం, ఉద్యమంలో గుర్తించిన కష్టాలు, నష్టాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆసరా పింఛన్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో కొత్త పింఛన్ రావాలంటే ఆయా గ్రామాల్లో పింఛన్ పొందిన లబ్దిదారుల్లో ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి దక్కేది. ఇటువంటి సంక్లిష్టతలను, ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ సరికొత్త రీతిలో దేశమే అబ్బురడేలా పింఛన్ విధానం ప్రకటించడమే కాదు, ఎనిమిదేళ్లుగా నిర్విరామంగా, నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారు.
అడగని వారి కూడా….
2014-15లో ఊపిరి పోసుకున్న నూతన పింఛన్ విధానంతో రాష్ట్రంలో 47లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి ఈ ఒక్క పథకానికే ప్రభుత్వం తొమ్మిదేళ్లలో రూ.54,989 కోట్లు ఖర్చు చేసింది. 2014లో 29,21,828 మందికి పింఛన్లు, ఏడాదికి రూ.861 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి. ఇది స్వరాష్ట్రం, స్వయం పాలనలో ఏడాదికి రూ.12 వేల కోట్లకు చేరింది. ఎక్కడి రూ.861 కోట్ల నుంచి రూ.12 వేల కోట్లకు చేరడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. అచిర ప్రాయంలోనే తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున పథకాల అమలులో ఎలా విజయవంతమైందనే అధ్యయనాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ఇవే పథకాలు తమకూ కావాలనే డిమాండ్లు మొదలయ్యాయి. సరిగ్గా బీఆర్ఎస్ ఆవిర్భావం జాతీయ స్థాయిలో జరిగిన తర్వాత తెలంగాణ పథకాలపై అన్ని పార్టీల్లో ఆలోచన మొదలైంది. ఇవన్నీ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ అజెండాగా మారితే ఎలా ఎదుర్కోవాలనే రీతిలో పార్టీలు అంతర్గతంగా చర్చించుకుంటున్న పరిస్థితి అనివార్యమైంది.
అందింది ఇలా…
సంవత్సరం లబ్ధిదారులు రూ.కోట్లలో
2014 33.86 1520
2015 37.66 4496
2016 37.27 4540
2017 39.90 4843
2018 40.35 4975
2019 39.74 8710
2020 38.80 9716
2021 37.36 8390
2023 44.48 8560