రావినూతల – అకాలవర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని, ఎటువంటి అధైర్య పడొద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ రైతన్నలకు భరోసా ఇచ్చారు.. వారిని అన్ని విధాల అదుకుంటామని హామీ ఇచ్చారు.. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని, అలాగే కౌలు రైతులకు కూడా పరిహారం వర్తింపజేస్తామని చెప్పారు.. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలలో ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం గార్లపాడు మార్గంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. రావినూతల శివారులోని మొక్కజొన్న రైతులతో పంట నష్టంపై ఆరా తీశారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? ఎంత పెట్టుబడి పెట్టారనే వివరాలు అడగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రానికి నష్ట వివరాలు తెలిపినా ,స్పందించదని, ఒక్క పైసా కూడా ఇవ్వదని మండిపడ్డారు.. కేంద్రానికి చెప్పడం అంటే దున్నపోతుకి చెప్పడమేనని అన్నారు.. ప్రస్తుతం లెక్కల ప్రకారం మొత్తం 2.28 లక్షల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లిందని అంచనాలు ఉన్నాయని అంటూ , వెంటనే రైతుల తక్షణ సాయం కోసం రూ.228 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.. ఒక్కొ ఎకరాకి రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాలలో వేస్తామన్నారు.. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.. అనంతరం ఆయన మహాబూబ్ నగర్ జిల్లాలోని రెడ్డాయకుంట తండాకు హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement