Wednesday, November 20, 2024

కొత్త స‌చివాల‌యంలో కొలువుదీరిన కెసిఆర్ టీమ్ – ఆరు బిల్లుల‌పై సంత‌కాలు చేసిన ముఖ్య‌మంత్రి

హైద‌రాబాద్ – అత్యాధునిక వసతులతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా సౌధం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యాన్ని నేటి మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు సింహ‌ల‌గ్న ముహుర్తంలో సీఎం కెసిఆర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ‌ మేయిన్‌ గేట్‌ వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అక్కడినుంచి నడుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి యాగశాలను సందర్శించారు. యాగ‌శాల‌లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఆ త‌ర్వాత‌ ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి.. సుముహూర్త సమయంలో కుర్చీలో ఆసీనులయ్యారు. అనంత‌రం ఆరు దస్త్రాలపై సంతకాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై కేసీఆర్ మొద‌టి సంత‌కం చేసి, ఆ ఉద్యోగుల్లో సంతోషం నింపారు.

ఈ సంద‌ర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మహమూద్‌ అలీ.. ముఖ్యమంత్రికి దట్టీ కట్టారు.

సచివాలయాన్ని ప్రారంభించిన అనంత‌రం అదే సమయానికి మంత్రులంతా ఎవరికివారు తమతమ కార్యాలయాలను ప్రారంభించుకున్నారు.. అలాగే . అధికారులు కూడా తమ తమ శాఖల కార్యాలయాల్లో ఆసీనుల‌య్యారు.. మంత్రులు, అధికారులు నేడు సాధార‌ణ ప‌రిపాల‌నా కార్య‌క్ర‌మాల‌కు కొత్త సచివాల‌యం నుంచి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు.. దీంతో హైదరాబాద్‌లో లక్ష మంది పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేసే కార్య‌క్ర‌మానికి మార్గం సుగ‌మం అయింది..

ఇక మంత్రి హరీశ్‌ రావు రెండు దస్త్రాలపై సంతకం చేశారు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

కాగా, ఆరో అంతస్థులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్‌తో ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు జనహిత పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా క్యాబినెట్‌ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్‌ హాలును ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement