Friday, November 22, 2024

Assembly – డేటా తొలగించినా ప్రజల మనస్సులోనే కెసిఆర్……

ప్రజల మనసులోంచి తొలగించలేరు

కంప్యూటర్ల నుంచి బీఆర్​ఎస్ ప్రభుత్వ సమాచారం తొలగింపు​
అక్షరాలను తొలగిస్తారేమో.. అనుభవాలు అట్లానే ఉంటయ్​
గత ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపాలే
కాంగ్రెస్​ ప్రకటించిన పింఛన్​ నాలుకమీదనే ఉంది
ఇంకెప్పుడు అమలులోకి తీసుకొస్తారు
బీఆర్ఎస్ ​శ్రమను, కాంగ్రెస్​ డ్రామాలను ప్రజలు చూస్తున్నారు
ఆచరణ సాధ్యం కాని అవాస్తవాల బడ్జెట్​ ఇది
బడ్జెట్​పై​ ప్రసంగంలో విరుచుకుపడ్డ హరీశ్​రావు

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – బడ్జెట్‌పై శాసనసభలో సాధారణ చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్​రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన ఆయన బడ్జెట్‌ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. జనం గుండెల్లో మాజీ సీఎం కేసీఆర్​ ఉన్నారని, కంప్యూటర్ల నుంచి డేటా తొలగిస్తే కేసీఆర్​ మార్క్​ తొలగిపోతుందా అని ప్రశ్నించారు. ప్రజల మనస్సులో కేసీఆర్​కు అదే చోటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ₹4.5 లక్షల లేని జీఎస్‌డీపీని బీఆర్ఎస్ ప్రభుత్వం ₹14 లక్షలకు తీసుకెళ్లిందన్నారు. రామగుండం నుంచి 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

నాలుకమీదనే పింఛన్​..

కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 వందల పింఛన్ ఇస్తే బీఆర్ఎస్ పాలనలో ₹2వేలకు పెంచినట్లు హరీశ్‌రావు తెలిపారు. అధికారంలోకి రాకముందు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామన్నారని గుర్తు చేశారు. అయితే, 4 వేల పింఛన్‌ నాలుక మీదనే ఉందని ఎద్దేవా చేశారు. పల్లెల అభివృద్ధి స్వచ్ఛతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంక్​ల్లో టాప్‌ 20లో 14 తెలంగాణకు వచ్చాయని గుర్తు చేశారు.

పదేండ్ల సమాచారం తొలగింపు..

బీఆర్ఎస్ పనితీరు తెలియకూడదని పదేళ్ల ప్రభుత్వం సమాచారాన్ని తొలగించారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌ అవాస్తవాలతో కూడిన బడ్జెట్ అని హరీశ్‌రావు విమర్శించారు. ట్యాక్స్‌ ద్వారా రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్‌లో పెట్టారని ఆరోపించారు. ఎలా వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు విధానాల రూపకల్పన కంటే బీఆర్ఎస్ నేతలను తిట్టడంపైనే ఎక్కువ దృష్టిపెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు.

వారి డ్రామాలను ప్రజలు చూస్తున్నారు..

బీఆర్ఎస్ శ్రమను, కాంగ్రెస్ ఎనిమిది నెలల డ్రామాలను ప్రజలు చూస్తున్నారని హరీశ్​రావు అన్నారు. గతంలో కరెంట్ పరిస్థితి గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడారని, కేశవరావు ఇంటికి సీఎం పోతే కరెంట్ పోయిందని ఎద్దేవా చేశారు. ఆ విషయాన్ని అన్ని పత్రికలు ప్రస్తావించాయని పేర్కొన్నారు. బడ్జెట్‌లో వాస్తవాల విస్మరణ-అవాస్తవాల ప్రస్తావన జరిగిందని హరీశ్‌రావు ఆరోపించారు.

ప్రజల మెదళ్ల నుంచి కేసీఆర్​ను తొలగించలేరు..

తమ ప్రభుత్వ పనితీరు గురించి సమాచారాన్ని తొలగిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కంప్యూటర్ నుంచి తొలగిస్తారేమో కానీ, ప్రజల మెదడు నుంచి తొలగించలేరని పేర్కొన్నారు. అక్షరాలను తొలగిస్తారేమో కానీ, అనుభవాల్ని తొలగించలేరన్నారు. ఆచరణ సాధ్యం కానీ అవాస్తవాల బడ్జెట్ ఇది అన్నారు. 2014లో రూ.10 వేల కోట్లు ఎక్సైజ్‌ ఆదాయం ఉందని, 2023- 24లో ₹34 వేల కోట్లకు చేరిందని హరీశ్​రావు తెలిపారు. బడ్జెట్​లో ఈ సంవత్సరం 42వేల కోట్లు రాబడి వస్తుందని బడ్జెట్​లో పేర్కొన్నారని తెలిపారు. తెలంగాణలో బెల్ట్ షాపులద్వారా ఇంకా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారని హరీశ్​రావు మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement