టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జైలు వెళ్తారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. జీవన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి అర్థ రహిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలకు విలువ లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచే కాంగ్రెస్ లోకి వచ్చి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడని, అప్పట్లో కేసీఆర్ కూడా టీడీపీ నుంచే వచ్చారని మల్లు రవి గుర్తు చేశారు. అనంతరం టీఆర్ఎస్‌కు కేసీఆర్ అధ్యక్షుడు అయ్యారని చెప్పారు.
కాగా, రేవంత్ రెడ్డి ఖైదీ నంబర్ 1799 అని, జైలు వెళ్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే జైలు పార్టీ అని విమర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. బ్లాక్ మెయిల్ చేయడంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడని దుయ్యబట్టారు. రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ శకం ఇక ముగిసినట్టేనని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.