Saturday, November 16, 2024

Kavval Forest – ఆ పెద్దపులి వెళ్లిపోయింది

ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు
క‌వ్వాల్ అభ‌యార‌ణ్యంలోకి వెళ్లిన‌ట్టు ఆన‌వాళ్లు
పాద‌ముద్ర‌ల‌ను సేక‌రించిన అట‌వీశాఖ సిబ్బంది
ట్రాప్ కెమెరాల‌ను ఏర్పాటు చేసిన అధికారులు
పెద్ద‌పులి అరుపుల విన్న గ్రామస్తులు
పెంబితండా భీమ‌న్న చెరువు ప్రాంతంలో పాదముద్ర‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఆదిలాబాద్ బ్యూరో: ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో వారం రోజులుగా తిరుగుతున్న పెద్దపులి ఎట్టకేలకు కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో అడుగుపెట్టింది. కవ్వాల్‌ పులుల సంరక్షణ పరిధిలోకి వచ్చే పెంబి అడవుల్లో పెంబితండా వద్ద రైతులకు కనిపించింది. దీంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడకు చేరుకుని పెంబితండా భీమన్న చెరువు ప్రాంతంలో పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు. ఇప్పటికే సమీప అటవీ ప్రాంతంలో ట్రాప్​ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు ఎఫ్‌ఆర్వో రమేశ్​రావు వెల్లడించారు. కాగా అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పసుపుల, ఘట్టిగూడెం గ్రామ అటవీ శివారులో పెద్దపులి అరుపులు వినిపించినట్లు గ్రామస్థులు చెప్పారు.

అట‌వీ ప్రాంత గ్రామాల్లో భ‌యం..

వారం రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల్లోనూ సంచరించింది. తొలుత మహారాష్ట్ర సరిహద్దుకు వంద మీటర్ల దూరంలోని అప్పారావుపేట్‌ బీట్‌ పరిధిలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేపట్టారు. పెద్దపులి అడవిలోకి వెళ్లిపోయిందని అనుకున్న తరుణంలో మళ్లీ జిల్లాలోని కుంటాల, హన్మాన్‌నగర్‌ తండా ప్రాంతాల్లో కనబడింది. కుంటాలలో మార్నింగ్​ వాకింగ్​కు వెళ్లిన ఓ వ్యక్తికి పెద్దపులి కనిపించడంతో వెంటనే అతను ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు.

కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలోనే..

- Advertisement -

కొన్ని రోజులుగా పులి ఈ ప్రాంతంలోనే సంచరించిన‌ట్టు తెలుస్తోంది. దీనికి ఆన‌వాళ్లుగా వరి పొలంలో పులి పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో పొలంలో పనిచేసుకుంటున్న రైతులకు పెద్దపులి కనిపించడంతో భయాందోళనకు గురై చెట్టెక్కి కూర్చున్నారు. పెద్దపులి తండాలోకి రాకుండా గ్రామస్థులందరూ కేకలు, డబ్బాలతో చప్పుడు చేయడంతో అడవిలోకి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడ సైతం అధికారులు పులి పాదముద్రలను సేకరించి నిర్ధారించారు. నిర్మల్​ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్​లోనూ పెద్దపులి కనబడింది. కొన్ని రోజులుగా జిల్లాలోని ఏదో ఒక చోట పెద్దపులి కనిపిస్తూ ఉందనే వార్త ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలోకి పెద్దపులి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement