న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసుపై సోమవారం విచారణ జరగకుండానే వాయిదా పడింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షుతో కూడిన ధర్మాసనం (కోర్టు నెంబర్ 2) ఎదుట సోమవారం కవిత కేసు విచారణకు వచ్చింది. జాబితాలో కేసు ఉన్నప్పటికీ, సోమవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేకపోవడంతో కోర్టు కార్యాకలాపాలు జరగలేదు.
మరోవైపు జస్టిస్ రవీంద్ర భట్ కూడా అందుబాటులో లేకపోవడంతో కోర్టు నెంబర్ 8లో కూడా కార్యాకలాపాలు జరగలేదు. ఈ పరిస్థితుల్లో కోర్టు నెంబర్ 2, కోర్టు నెంబర్ 8లలో పొందుపరిచిన అన్ని కేసులను వాయిదా వేసినట్టు సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో పేర్కొంది. తదుపరి విచారణ తేదీలను త్వరలోనే తెలియజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో కవిత కేసు తదుపరి తేదీ ఖరారైన తర్వాత విచారణకు రానుంది.