Friday, October 18, 2024

Delhi: కవిత బెయిల్‌ విచారణ రేపటికి వాయిదా

రేపు వాదనలు పూర్తయ్యాక
తీర్పు రిజర్వ్ చేస్తానని చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ
కేసు గురించి అన్ని విషయాలు తెలుసు: జస్టిస్‌ స్వర్ణ కాంత
కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు పూర్తి

లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టగా.. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ కోరడంతో పాటు అరెస్టు, రిమాండ్‌ను కవిత సవాల్ చేశారు. ఎమ్మెల్సీ కవిత తరఫున ఇవాళ‌ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించారు.

కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి పలు కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవితపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందని.. కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న కారణంగా విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని తెలిపారు. తాము ఇచ్చిన అండర్ టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని చెప్పారు.

- Advertisement -

సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండగానే 41(ఏ) ప్రకారం సమన్లు జారీ చేశారని ఆయన గుర్తు చేశారు. సీఆర్పీసీ 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చినవారు, తర్వాత 41(ఏ)కు ఎందుకు మారారో తెలియదన్నారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగుతుండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందని తెలిపారు.

అదే రోజు ఈడీ కవితను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించిందన్నారు. ఇదిలా ఉంటే.. జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సీబీఐ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. కానీ కవితకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం సీబీఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఆ తర్వాత కనీసం అరెస్ట్ వారంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసిందని తెలిపారు.

ఇది ఇలా ఉంటే కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరిని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రశంసించారు. ఫలితం ఎలా ఉన్నా వాదనలు చాలా బాగా వినిపిస్తున్నారని జడ్జి మెచ్చుకున్నారు. . రేపు మధ్యాహ్నం కౌంటర్ వాదనలు వినిపిస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement