హైదరాబాద్: దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఎన్నికల జరిగే రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందంటూ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కొన్ని రాష్ట్రాలకు చెందిన బడ్జెట్‌లా ఉందని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం విఫలం అయ్యిందనడానికి ఈ బడ్జెటే ఊదాహరణ అని ఆమె అన్నారు. వేతన జీవులకు రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉందని అశించినా కేవలం దానిని రూ.7 లక్షలకే పరిమితం చేశారని కవిత వివరించారు..
అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం లబ్ధి చేకూరేలా కేంద్రం డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రకటించిందని మండిపడ్డారు. మౌళికసదుపాయాల కల్పన కోసం పదివేల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పార నికానీ ఎటువంటి మౌళికసదుపాయాలో ఆ బడ్జెట్‌లో వెల్లడించలేదని ఆమె విమర్శించారు. సుమారు వెయ్యి కోట్ల వరకు కేంద్రం తమకు రుణపడి ఉందని, ఆ బాకీలు చెల్లించాలని ఆర్ధికమంత్రిని కోరుతున్నట్లు కవిత తెలిపారు. అలాగే స్మార్ట్ సిటీల కోసం నిధులు కనిపించలేదని, వైద్య,ఆరోగ్య రంగాలకు నామమాత్ర కేటాయింపులతో సరిపెట్టారని అన్నారు.