న్యూఢిల్లీ – తనను ఈ నెల 7న ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరచాలని, వీడియో కాన్ఫరెన్స్ వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టును కోరారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. న్యాయస్థానం ఆమెను మే 7వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. దీంతో ఆరోజున విచారణ సంస్థలు ఆమెను కోర్టు ముందు హాజరుపరుస్తాయి. అయితే తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరచాలని ఆమె దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో కస్టడీ ముగిసినప్పుడు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరిచే అవకాశం ఉండటంతో కవిత దరఖాస్తు చేసుకున్నారు. కవిత అరెస్టైనప్పటి నుంచి రౌస్ అవెన్యూ కోర్టు నాలుగుసార్లు కస్టడీని పొడిగించింది. మొదటిసారి కోర్టుకు హాజరైనప్పుడు కవిత మీడియాతో మాట్లాడారు. దీంతో ఆ తర్వాత ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపరిచారు.