Friday, November 8, 2024

Kasturbha …. ఆ ఆడ‌పిల్ల‌లో క‌న్నీళ్లు క‌నిపించ‌డం లేదా … రేవంత్ ను నిల‌దీసిన హ‌రీశ్ రావు…

హైద‌రాబాద్ : ఆడ‌పిల్ల‌లు రోడ్డెక్కి ధ‌ర్నా చేస్తుంటే ఈ ప్ర‌భుత్వం ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..? అని నిల‌దీశారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు . ఆడపిల్లలు రెండు కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు స్పందన లేదని మండిప‌డ్డారు. రంగారెడ్డి జిల్లాలోని పాల‌మాకుల క‌స్తూర్బా గాంధీ బాలిక‌ల విద్యాల‌యాన్ని ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి హ‌రీశ్‌రావు నేడు సంద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌డి విద్యార్ధినులు త‌మ గోడును వినిపించుకున్నారు… దానిపై హ‌రీశ్ మాట్లాడుతూ, పిల్ల‌ల బాధ తెలుసుకోవాల‌ని ఇక్క‌డికి వ‌చ్చాం. పిల్ల‌ల క‌ళ్ల‌లో నీళ్లు కారిపోతున్నాయి. దుఃఖాన్ని ఆపులేక‌పోతున్నారు. భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే విప‌రీతంగా క‌ర్ర‌లు విరిగిపోయేలా కొడుతున్నార‌ని ఏడుస్తున్నారు. పిల్ల‌ల ప‌రిస్థితి చూస్తుంటే మా కళ్ల‌ల్లో కూడా నీళ్లు ఆగ‌లేదు. అన్నంలో పురుగులు వ‌స్తున్నాయ‌ని చెబితే, వాటిని తీసేసి తినండిని టీచ‌ర్లు చెబుతున్నార‌ని పిల్ల‌లు చెప్పారు. పాఠాలు స‌రిగా చెప్ప‌డం లేదు. మంచి భోజ‌నం లేదు. క‌నీస సౌక‌ర్యాలు కూడా లేవ‌ని పిల్ల‌లు బాధ‌ప‌డుతున్నారు. ఒక జ‌త బ‌ట్ట‌లు మాత్ర‌మే ఇచ్చారని ఆరో త‌ర‌గ‌తి పిల్ల‌లు చెబుతున్నారు. బుక్స్ కూడా ఇవ్వ‌లేదు. బ‌ట్ట‌లు రావు.. పుస్త‌కాలు రావు.. క‌డుపు నిండా భోజ‌నం పెట్టే ప‌రిస్థితి లేదు. గ‌తంలో కేసీఆర్ స‌న్న‌బియ్యంతో భోజ‌నం పెడితే.. ఇవాళ గొడ్డుకారంతో భోజ‌నం పెడుతున్నారు. ప్ర‌తి రోజు కోడిగ‌డ్డు ఇవ్వాల‌ని ఉంది. వారానికి రెండుసార్లు ఇస్తున్నారు. ఆ కోడిగుడ్లు వాస‌న వ‌స్తున్నాయ‌ని, వాటిని తిన‌క‌లేక‌పోతున్నామ‌ని పిల్ల‌లు బాధ‌ప‌డుతున్నార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

- Advertisement -

రేవంత్ మాట‌లు కోట‌లు దాటుతాయి.. చేత‌ల్లో మాత్రం శూన్యం అంటూ మండిప‌డ్డారు . రేవంత్ రెడ్డి యూ ఆర్ ఏ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్ట‌ర్.. నువ్వు పూర్తిగా విఫలం అయిపోయావు అంటూ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యాశాఖ, , సోషల్ వెల్ఫేర్ కూడా రేవంత్ దగ్గరే ఉంద‌ని అంటూ, మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతున్నాయంటే నువ్వు ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అని ధ్వ‌జ‌మెత్తారు. .

హాస్ట‌ల్ విద్యార్థుల‌కు అందాల్సిన కాస్మోటిక్ ఛార్జిలు అంద‌డం లేదు. మెస్ బిల్లులు విడుద‌ల చేయ‌డం లేదు. పిల్ల‌ల‌కు పురుగుల‌తో కూడిన అన్నం పెడుతున్నారు. నీవు పూర్తిగా విఫ‌లం అయ్యావు. మాట‌లు కాదు.. యాక్ష‌న్‌లో చేసి చూపించు. పిల్ల‌ల గురించి ఆలోచించు అని హ‌రీశ్‌రావు సూచించారు.

ఈ ప్ర‌భుత్వంలో క‌స్తూర్బా విద్యాల‌యాల‌తో పాటు ఇత‌ర‌ గురుకులాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. విషాహారం తిని పిల్ల‌లు ఆస్ప‌త్రుల పాల‌వుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 500 మంది దాకా ఆస్ప‌త్రి పాల‌య్యారు. 38 మంది చ‌నిపోయారు. ఒక వైపు పాము కాట్లు, మ‌రో వైపు ఎలుక‌లు కొరుకుతున్నాయి. అయినా ప్ర‌భుత్వం మొద్దు నిద్ర పోతోంది. రామాయంపేట ఎస్సీ గుర‌కులంలో 11 మంది, న‌ల్ల‌గొండ బీసీ గురుకులంలో 13 మంది విద్యార్థుల‌ను ఎలుక‌లు కొర‌క‌డంతో వారు ఆస్ప‌త్రి పాల‌య్యారు. ఒక‌ప్పుడు తెలంగాణ గురుకులాలు దేశానికి ఆద‌ర్శంగా ఉండేవి. ఇవాళ త‌ల్లిదండ్రులు కూడా క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. కులం పేరుతో దూషిస్తున్నార‌ని పిల్ల‌లు చెబుతున్నారు. ఇప్ప‌టికైనా రివ్యూ చేయండి.. టీచ‌ర్లంద‌రిని మార్చండి. నాణ్య‌మైన భోజ‌నం పెట్టండ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి హ‌రీశ్‌రావు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement