Friday, November 22, 2024

“బాలిక” విద్యకు నిలయాలు కస్తూర్బా గాంధీ పాఠశాలలు: మంత్రి హరీశ్ రావు

ఉమ్మడి మెదక్ బ్యూరో : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యకు కస్తూర్బా గాంధీ పాఠశాలలు నిలయాలుగా మారాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లాలోని 17 కేజీబీవీ పాఠశాలలు నో అడ్మిషన్స్ బోర్డు పెట్టే స్థాయికి చేరడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చెప్పారు.

సిద్ధిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి-మిట్టపల్లి పరిధి కేజీబీవీ అప్ గ్రేడ్ జూనియర్ కళాశాలకు రూ.230 లక్షలతో నూతన భవన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదింటి బాలికలకు ఉన్నత విద్యే లక్ష్యమని తెలిపారు. కేజీబీవీలతో పేద వర్గాల చిన్నారులకు కొండంత అండ దొరికినట్లు అయ్యిందని, అందనంత దూరంగా ఉన్న కార్పోరేట్‌ స్థాయి విద్య, వసతులతో జిల్లాలోని 22 కేజీబీవీల్లో 17 కేజీబీవీలలో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టినట్లు, ఇప్పుడు అడ్మిషన్లు దొరకని పరిస్థితికి జిల్లాలోని కేజీబీవీలు చేరడం అభినందనీయమని చెప్పారు.

పౌష్టికాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.

భోజనం ఏలా ఉందమ్మా. మెనూ ప్రకారం ఇస్తున్నారా. లేదా.. అంటూ కేజీబీవీ విద్యార్థినీలతో మంత్రి హరీశ్ ముచ్చటించారు. ఉదయం అల్ఫాహారం, మధ్యా హ్నం గుడ్డుతో కూడిన భోజనం, సాయంత్రం నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, ఆదివారం చికెన్‌తో కూడిన భోజనం వడ్డిస్తున్నారని విద్యార్థినీలు మంత్రికి బదులిచ్చారు. ఈ మేరకు కేజీబీవీ ఇంటర్మీడియట్ విద్యార్థినీలు ల్యాబ్ సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరగా వెంటనే మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. అనంతరం ప్రతీ తరగతి గదిలో విద్యార్థినీలతో మంత్రి ఆత్మీయతతో పలకరింపులు చేశారు.

హన్మకొండ-సిద్ధిపేట రహదారిన ఫోర్ లేన్ ఆర్వోబీ.

నూతనంగా నిర్మిస్తున్న మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ పై సిద్దిపేట అర్బన్ మండలం రంగదాంపల్లి వద్ద మెదక్ – ఎల్కతుర్తి జాతీయ రహదారిపై రూ.55 కోట్ల వ్యయంతో నాలుగు వరసల-ఆర్వోబీ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement