రేపటి నుంచి కార్తీకమాసం
నెల రోజులపాటు ఆధ్యాత్మిక వైభవం
ముస్తాబైన ఖమ్మం గుంటు మల్లేశ్వర స్వామి క్షేత్రం
వరంగల్ జిల్లాలోని ఆలయాలన్నీ రెడీ
ఆంధ్రప్రభ స్మార్ట్, ఖమ్మం, వరంగల్ కల్చరల్ : కార్తీక మాసం శనివారం నుంచి ప్రారంభమవుతోంది. శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీకమాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు శైవక్షేత్రాలు సిద్ధమవుతున్నాయి. కార్తీకమాసం సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగును. ఈ నెల 4,11,18,25 తేదీల్లో కార్తీక సోమవారాలు పూజలు, ఉపవాస దీక్షను భక్తులు పాటిస్తారు. అలాగే ఈ నెల 12న, 26న కార్తీక ఏకాదశి రోజుల్లో శివాలయాలతోపాటు వైష్ణవ ఆలయాలను భక్తులు దర్శించుకుంటారు. ఉసిరి చెట్టు నీడలో భోజనాలు పుణ్యమని భావించి ఉసిరి చెట్టు ఉన్న తోటల్లో కార్తీక వన భోజనాలు నిర్వహిస్తారు.
కార్తీకమాసంలో చేయాల్సిన ప్రత్యేక పూజలు
కార్తీకమాసానికి సమానమైన మాసం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగ కంటే పుణ్యమైన తీర్థాలు లేవని పురాణ గాథలు చెబుతున్నాయి. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది మహిమాన్వితమైనది శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ నెలలో శివాలయాల్లో రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు నిర్వహిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు అని అలంకారాలు, రాజోపచార నైవేద్యాలతో పనిలేకుండా మనసులో శివుని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ప్రీతి చెందుతాడని, శివాభిషేకం సకల దోషాలు నివారించి శుభాలను కలుగజేస్తోంది. శివాలయంలో అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమమైనవి. ఈ మాసంలో శివునికి అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలితాలు లభిస్తాయి. తులసీ దళాలతో మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర చెబుతున్నాయి. ఈ మాసంలో మహా విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. తులసి పూజ చేయడం పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేష్ఠం. మహా శివుడు, మహా విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం చాలా శ్రేష్టమైనది. కార్తీక మాసం ప్రారంభం నుండే ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఈ మాసంలోనే వైకుంఠ చతుర్దశి. దాత్రి నారాయణ పూజ, కార్తీక పౌర్ణమి, వైకుంఠ చతుర్దశి చిలుకు ద్వాదశి, తులసి కల్యాణం విశేష మైనవి.
ఖమ్మం జిల్లాలో శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శివాలయాలు, వైష్ణవాలయాలు కూడా కార్తీక ఆధ్యాత్మిక శోభకు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని గోదావరి, మున్నేరు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు విడిచిపెడుతుంటారు. ఆ నదీ రేవుల వద్దకు తెల్లవారు జామున భక్తులు చేరుకుని కార్తీకదీపాలు విడిచిపెడుతుంటారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివాలయాలు…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శైవక్షేత్రాలు సర్వం సిద్ధమవుతున్నాయి. పెనుబల్లి మండలంలో నీలాద్రి శైవ క్షేత్రం, భద్రాచలంలో ప్రసిద్ధ సీతారామాలయం, ఖమ్మం మండలంలో తీర్దాల సంగమేశ్వర స్వామి ఆలయం , కూసుమంచిలో స్వయంభూ శివాలయం, ఖమ్మం సిటీలో గుంటు మల్లేశ్వర స్వామి స్వయంభు శైవ క్షేత్రం, అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయం, సంబద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మధిరలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం, పాల్వంచలో పెద్దమ్మ తల్లి ఆలయం కార్తీకమాస పూజలకు సిద్ధమవుతున్నాయి.
వరంగల్ నగరంలో…
ఉమ్మడి వరంగల్ జిల్లా శైవ క్షేత్రాలకు ప్రసిద్ధ వరంగల్ నగరంలో గట్టుపల్లి పండుగల రామలింగేశ్వర స్వామి దేవాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వర ఆలయం, సిద్దేశ్వరాలయం, జలేశ్వరాలయం, వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం, కోటిలింగాల, కాశీబుగ్గ రామలింగేశ్వర ఆలయం దేవాలయం, అయినవోలు మల్లికార్జున స్వామి దేవాలయం, కొరవి వీరభద్ర స్వామి దేవాలయం, కొత్తకొండ మల్లికార్జున స్వామి, కాలేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం, రామప్ప దేవాలయం ముస్తాబయ్యాయి. వేయి స్తంభాల దేవాలయంలో కోటి దినోత్సవం నిర్వహిస్తారు. అన్ని శైవక్షేత్రాల్లో ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేస్తారు.