జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం భవానీ సహిత గణపేశ్వరాలయం కోట గుళ్లలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను అర్చకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కోట గుళ్ళ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారిని పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. నాగుల చవితి కూడా ఇదే రోజు కావడంతో పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మహిళలు నాగ దేవునికి పుట్టలో పాలు పోసి దీపాలను వెలిగించారు. అదేవిధంగా తులసి, మారేడు, మేడి, ఉసిరి, తెల్ల జిల్లేడు వృక్షాల వద్ద దీపాలను వెలిగించి నైవేద్యం సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నరేష్ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.