Saturday, November 23, 2024

Delhi | కర్నాటక గెలుపు.. పూర్వవైభవానికి తొలి అడుగు: వంశీచంద్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పూర్వవైభవానికి తొలి అడుగు అని ఏఐసీసీ కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రతో దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతమైందని అన్నారు. కర్ణాటకలో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పర్యటించిన 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుందని తెలిపారు.

అదే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించిన నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఆ పార్టీ ఓటమి పాలైందని సూత్రీకరించారు. ప్రజల్లో భారతీయ జనతా పార్టీపై వ్యతిరేకత నానాటికీ పెరుగుతోందని చెప్పడానికి ఈ ఫలితాలే ఒక నిదర్శనమని వంశీచంద్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుద్యోగం,పెరిగిన ధరలు వంటి ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడకుండా విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలనే బీజేపీ ప్రచారాంశాలుగా ఎంచుకుందని, కానీ ప్రజలు తమ ఓటుతో తిప్పికొట్టారని అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిందని అన్నారు. అలాగే కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీకి రెండు కళ్లలా వ్యవహరించి గెలిపించారని అన్నారు. ఇద్దరి మధ్య పొరపొచ్ఛాలు, అభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ పార్టీ కోసం కలసికట్టుగా, ఐకమత్యంగా కష్టపడి పనిచేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి ఎవరన్నది సీఎల్పీ సమావేశంలో కొత్తగా గెలుపొందిన ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని చెప్పారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ పార్టీ రాష్ట్ర నాయకత్వం కలసికట్టుగా పనిచేస్తే గెలుపు ఖాయమని వంశీచంద్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement