Friday, November 1, 2024

KNR: ప్రపంచానికి ఇచ్చిన విలువైన కానుక యోగా

యోగాతో మానసిక ప్రశాంత
యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారత దేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కానుక యోగా అని, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం, ప్రశాంత జీవనంతో ఆరోగ్యం పై పట్టు సాధించవచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ ఘాట్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీ బిజీ గా ఉండే అధికారులు, సిబ్బంది నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చని అన్నారు. అధికారులు, సిబ్బంది నిత్యం విధి నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోక పోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవలందించగలరని అన్నారు.

భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావనను, ప్రాపంచిక ధృక్పథాన్ని బోధిస్తుందన్నారు. అన్ని దేశాల్లోని ప్రజలు యోగాలోని శక్తిని, ప్రాముఖ్యతను రోగ నిరోధక సామర్థ్యాన్ని గుర్తించి యోగా ను వినియోగంలోకి తీసుకొచ్చాయనీ అన్నారు. మిగతా ఎక్సర్సైజ్ ల్లా గా కాకుండా, ఎక్కడైనా, ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేకుండా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని మానసిక సమతుల్యత లభించే ఏకైక మార్గం యోగ ఆనీ తెలిపారు. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలు కలుగుతాయన్నారు.

- Advertisement -

అధికారులు, సిబ్బంది యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా ఆనందకర జీవితాన్ని పొందగలరని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ అరగంట, గంట పాటు యోగా చేస్తే చాలా వరకూ లైఫ్ స్టయిల్ అనారోగ్యం పాలుకాకుండా ఉండవచ్చన్నారు. ఒత్తిడి, ఆదుర్దా వంటివి లేకుండా ప్రశాంత జీవనం సొంతం అవుతుందన్నారు. యోగ శిక్షకులతో కలసి ఎస్పీ, అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రాచారి, సిఐ లు సదన్ కుమార్, అనిల్ కుమార్, మధుకర్, ప్రవీణ్ కుమార్, శ్రీలత, ఆర్ఐ లు యాదగిరి, మధుకర్, రమేష్ , యోగ గురువు శ్రీనివాస్, ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement