ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఆంబులెన్స్
ఇరువైపులా భారీగా నిలిచిన వాహనాలు
పెద్దపల్లి, నవంబర్ 26 (ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రైల్వే గేటు వద్ద వాహనదారుల రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఈ రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్య నెలకొంది. తాజాగా మంగళవారం రైల్వే గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఓ ఆంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడేందుకు వెళ్తున్న ఆంబులెన్స్ ఇలా గేటు వద్ద ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
గేటుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పెద్దపల్లి నుంచి వరంగల్, భూపాలపల్లి జిల్లాలకు వెళ్లే వారు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటారు. వాహనదారుల ఇబ్బందులు దూరం చేసేందుకు ప్రభుత్వం కునారం రైల్వే గేటు వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తున్నప్పటికి అనుకున్న వేగవంతంగా పనులు సాగక పోవడంతో ప్రయాణికుల అవస్థలు మాత్రం దూరం కావడం లేదు. ఈ మార్గంలో తరచూ ఇదే పరిస్థితి ఉంటుందని వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.