Sunday, November 24, 2024

మరింత బాధ్యతతో పనిచేయండి.. వీఆర్ఏలకు గంగుల సూచన

వీఆర్ ఏ లు మరింత బాధ్యతతో పనిచేయాలని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో వీఆర్ఎలకు ఆపాయింట్మెంట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై… కలెక్టర్ గోపి… ఎమ్మెల్యే రసమయి… మేయర్ సునీల్ రావులతో కలిసి… 442 మంది విఆర్ఏలకు అపాయింట్మెంట్లను అందజేశారు. అనంతరం వీఆర్ఏలందరితో కలిసి ఫోటోలు దిగారు. ఉద్యోగాల నియామకాల్లో… వారి వారి విద్యార్హతలకు అనుగుణంగా… జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లుగా నియమించారు. 155 మంది వీఆర్ఏలను రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు కేటాయించగా… మెడికల్ ఎడ్యుకేషన్ కు ఇద్దరిని… మిషన్ భగీరథకు 71 మందిని… ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు 125, ఎంఏ అండ్ యూడి డిపార్ట్ మెంట్ కు 74 మంది వీఆర్ఏలకు కేటాయించగా… మరో 16మంది వీఆర్ఏలను ఇతర జిల్లాల్లో నియమించారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. తెలంగాణ బిడ్డలు ఆకలితోనైనా పడుకుంటారే తప్పా… ఆత్మగౌరవం లేకుండా బతకలేరని… అందరికీ సమానత్వం రావాలని సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్డర్ తీసుకుంటున్న మీకు శుభాకాంక్షలన్న మంత్రి గంగుల… వీఆర్ఏల విద్యార్హతను బట్టి పోస్టింగ్ లు ఇచ్చామన్నారు. జీవో నెంబర్ 81 ద్వారా ఒక్క సంతకంతో… వీఆర్ఎలందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించిన ఘనత కేసీఆర్ దన్నారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నీళ్లు, నిధులతో పాటు ఆత్మగౌరవం కోసమే తెలంగాణను సాధించుకున్నామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు.

తెలంగాణ రాకముందు వీఆర్ఏలతో వెట్టిచాకిరి చేయించి… అరకొరా జీతాలు ఇచ్చేవారని… కాని నేటినుంటి మీరంతా పీఆర్సీ పరిధిలోకి వస్తారని… మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండబోతుందన్నారు. మీ అందరికి… ఇప్పుడు పనిచేసే మండలంలోనే పోస్టింగ్ ఇచ్చేందుకు పెద్ద కసరత్తే చేశామన్న మంత్రి గంగుల… కొంతమంది మాత్రం ఇతర జిల్లాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వారిని కూడా… తిరిగి కరీంనగర్ జిల్లాకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నూతనంగా ఉద్యోగాల్లో నియమితులైన మీరంతా… మీ సర్వీస్ పదిమందికి ఉపయోగపడేలా సేవలందించాలని సూచించారు. 61 ఏళ్లు దాటిన వీఆర్ఏలకు సముచిత న్యాయం కల్పిస్తామన్న మంత్రి గంగుల… మీ అందరికీ ప్రజాసేవ చేసుకొనే భాగ్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. నేటి నుంచి మీరంతా అధికారులే… గల్లా ఎగరవేసి ముందుకు సాగండంటూ భుజం తట్టి ప్రోత్సహించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement