పెద్దపల్లి, ఏప్రిల్ 11(ప్రభన్యూస్): మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్ర, వారు సాధించిన విజయాలు, మంచి సమాజం ఏర్పాటు కోసం వారు చేసిన కృషి అందరికీ తెలియాలని జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతామన్నారు. సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతిబా పూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి మనమంతా తీసుకోవాలని, సామాజిక అసమానతలు దూరమయ్యేందుకు మన వంతు కృషి చేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. విద్య అందరికీ అందాలని పూలే దంపతులు కృషి చేశారని అదనపు కలెక్టర్ తెలిపారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యా వంతులు కావాలన్నారు.
మహనీయుల ఆశయాల సాధనకు మనమంతా కృషి చేయాలని, సమాజంలో ఉన్న దురాచారాలు తొలగించేందుకు మహనీయులు తీవ్ర కృషి చేశారని, నవ సమాజ నిర్మాణం కోసం మహనీయులు చూపిన బాటలో మనమంతా నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.