Thursday, November 7, 2024

KNR: ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలకు రక్షణ ఏది..

డాక్టర్లపై దాడులను అరికట్టాలి
జిల్లా కేంద్రంలో వైద్యుల భారీ నిరసన ర్యాలీ


పెద్దపల్లిరూరల్, సెప్టెంబర్ 13(ప్రభ న్యూస్): ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలకు రక్షణ లేదని, భయపడుతూ రోగులకు వైద్యం అందించే ధీనస్థితిలో ఉన్నామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పగడాల కాళీ ప్రసాద్ రావు అన్నారు. పెద్ధపల్లి సిద్దార్థ పిల్లల ఆసుపత్రి ఫర్నీచర్ ద్వంసం చేసి ఆసుపత్రి వైద్యుడు కొక్కుల రాజేష్ పై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో ఐఎంఏ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఐఎంఏ నాయకులు పాల్గొని జిల్లా కేంద్రంలో ప్రైవేటు వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ కమాన్ చౌరస్తా వరకు నిర్వహించి రాజీవ్ రహదారిపై మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు.

- Advertisement -

ఈ సందర్బంగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ… పెద్ధపల్లి పట్టణంలోని సిద్దార్థ పిల్లల ఆసుపత్రి వైద్యుడు కొక్కుల రాజేష్ పై హత్యాయత్నానికి పాల్పడ్డ అమానవీయ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైద్యులమే కానీ దేవుల్లం కాదని, వైద్య వృత్తిని దైవంగా భావించే వైద్యులు కావాలని నిర్లక్ష్య వైఖరితో వైద్యం చేయమన్నారు. ఖదీర్-రేష్మా దంపతుల కూతురు నబియా అనారోగ్యానికి గురై మృతి చెందిందని డాక్టర్ నిర్లక్షంతో జరిగిన ఘటన కాదన్నారు. వైద్యుల తప్పిదంతో ఘటనలు జరిగితే చట్టప్రకారం శిక్షపడేలా వ్యవహరించాలే తప్ప దాడులు చేయడం సరైన విదానం కాదన్నారు.

మృతురాలి బంధువులు నడిరోడ్డుపై ప్రజలు చూస్తుండగా మారణాయుధం పట్టుకుని డాక్టర్ కొక్కుల రాజేష్ ను వెంబడిస్తూ హత్యాయత్నానికి పాల్పడడం ఆటవిక చర్య అన్నారు. ప్రాణాలు పోసే వైద్యుల ప్రాణాలు తీస్తామంటూ వెంటపడి చంపాలనుకోవడం సభ్య సమాజంలో సిగ్గుచేటన్నారు. నేడు ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై ఇటువంటి దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఆసుపత్రి డాక్టర్లు, మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement