వస్త్ర పరిశ్రమల మూతతో ఉపాధి కోల్పోయిన నేతన్న
సిరిసిల్ల, జూన్ 22 (ప్రభ న్యూస్) : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కార్మిక వాడలో అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో కుడిక్యాల నాగరాజు (42) అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక 11వ వార్డు రాజీవ్ నగర్ కు చెందిన నాగరాజు మరమగ్గాలు (పవర్ లూమ్ లు) నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.
గత ఆరు నెలల నుండి సాంచాలు మూతపడి ఉపాధి లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు గురైనట్టు చెబుతున్నారు. శుక్రవారం అప్పుల బాధతో బాత్రూంలో ఉపయోగించే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు.
నాగరాజుకు రూ.4లక్షల మేరకు అప్పు అయ్యిందని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కుమారుడికి కళాశాల ఫీజు ఎలా కట్టాలని తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యకు గురైనట్టు తెలిసింది. మృతుడి భార్య లావణ్య (38) బీడీ కార్మికురాలిగా పని చేస్తుండగా పెద్ద కుమారుడు లోకేష్ (16) ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రైవేటు కళాశాలలో చేరాడు. చిన్న కుమారుడు విగ్నేష్ (12) ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుడికి పోస్టుమార్టం నిర్వహించారు.