యైటింక్లయిన్‌కాలనీ : ప్రజల మధ్యలో ఉంటూనే.. ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని, నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రామగుండం సిపి రామ రాజేశ్వరి పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను సీపీ తనిఖీ చేశారు. ఈసందర్భంగా టూ టౌన్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం మొక్కలు నాటారు. పోలీస్‌స్టేషన్ లో రికార్డులను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ప్రజలకు సేవ చేసేందుకు పోలీసు ఉద్యోగంలో చేరానని, వారి రక్షణ కోసమే నిరంతరంగా పనిచేస్తానన్నారు. రామగుండం కమిషనరేట్‌కు సీపీగా రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు చాలా మంచివారని, వారితో మమేకమై వారి మధ్యలో ఉంటూ పనిచేస్తామన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూ వారికి ఎల్లప్పుడూ సేవలందిస్తామన్నారు. కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, చిన్న చిన్న అంతరాయాలు ఉంటే వాటిని కూడా సరిచేసి నిఘా నేత్రాలు ఎప్పుడూ పని చేసేలా చూస్తామన్నారు. సీసీ కెమెరాల ద్వారానే నేరాలను త్వరగా నియంత్రించవచ్చన్నారు.
2023 సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసులు ప్రజలకు సేవ చేసేందుకు చిన్న జిల్లాలను ఏర్పాటు- చేయడంతోపాటు రామగుండం కమిషనరేట్‌ను కూడా ఏర్పాటు చేశారని, తద్వారా తక్కువ పరిధిలో కమిషనరేట్ ఉండడంవల్ల ఎక్కువ సేవ చేసే అవకాశం ఏర్పడిందన్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, రౌడీ షీటర్లలో సీనియర్ సిటిజనులు తీసివేయడంతో పాటు కొత్తగా నేరాలు చేసిన వ్యక్తులను ఐడెంటిఫై చేసి రౌడీ షీట్ ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై, షీటీం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడాలన్నారు. మహిళల కోసం షీ టీం లు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయని, మహిళా రక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుండి పని చేస్తుందన్నారు. బాధితులు ఎవరైనా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి పిటీషన్ ఇవ్వవచ్చని, లేదంటే తన వద్దకు వచ్చినా సరే సమస్యను పరిష్కరిస్తానన్నారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్జీ2 ఓసిపి త్రీ ప్రాజెక్టును వ్యూ పాయింట్ వద్ద నుండి పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఏసీపీ గిరి ప్రసాద్, గోదావరిఖని టూ టౌన్ సీఐ సూరం వేణుగోపాల్, కమాన్‌పూర్ ఎస్సై షేక్ మస్తాన్, ఎస్సైలు శ్యాం పటేల్, కళాధర్ రెడ్డి, ఏఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.