- ప్రకృతి ఒడిలో.. ప్రాణాలు గాల్లో
- నిర్లక్ష్యంతో ప్రాణాలు బలి
పెద్దపల్లి రూరల్ : ప్రకృతి అందాలను వీక్షించేందుకు వెళ్లే పర్యాటకులు కొందరు నిర్లక్ష్యంగా సరదా కోసం ప్రకృతి ఒడిలో ప్రాణాలను గాల్లో కలుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆ జలపాతం మనుషుల పాలిట యమపాశంగా మారింది. పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామ శివారు గౌరిగుండాల జలపాతం యమపురికి నిలయంగా మారింది. సబ్బితం నుండి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో గుట్టపై ఒకప్పుడు గట్టు సింగారం గ్రామం ఉండేది. గుట్టపైనే ప్రజలు వ్యవసాయం కూడా చేసేవారని నానుడి. ఆ గుట్టపై నుండి వానాకాలంలో నీరు కిందికి జాలు వారుతుండడంతో ఇటీవలి కాలంలో అక్కడికి పర్యాటకుల తాకిడి పెరిగింది. 6 ఏళ్లుగా గౌరీ గుండాల జలపాతంగా ప్రసిద్ధి చెందింది. అక్కడికి కుటుంబ సమేతంగా పర్యాటకులు తరలి వెళ్లి జలపాతం, ప్రకృతి అందాలతో పరవశించిపోతున్నారు జనం. యువత అత్యుత్సాహంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గుట్టపైనుండి నీరు జలువారే చోట కొందరు యువకులు రాళ్లపై చేసే విన్యాసాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. జలపాతం సందర్శన ప్రారంభమైన నాటినుండి ఇప్పటివరకు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గ్రామ పంచాయితీ పాలకవర్గం, పోలీసులు అప్రమత్తం చేసినా కొందరు యువకులు పట్టించుకోవడం లేదు. పైనుండి జారిపడి కొందరు, నీటి గుంతలో మునిగి మరికొందరు మృత్యువాత పడ్డారు. ప్రకృతి, జలపాతం అందాలు ఆస్వాదించాల్సిన పర్యాటకులు ప్రమాదాలను గుర్తించడం లేదు. కొంతమంది యువకులు మద్యం మత్తులో చేసే విన్యాసాలు, హంగామా పొరపాటున వారికే శాపంగా మారిన సందర్భాలున్నాయి. జలపాతం సందర్శన నిలిపి వేస్తూ గ్రామం నుండి వెళ్లే మార్గం మూసి వేసినా కొందరు ఇతర గ్రామాల మార్గాల గుండా అక్కడకు వెళుతూనే ఉన్నారు. ప్రమాదాలను నివారించేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ చుంచు సదయ్య జలపాతం వద్ద గురువారం పెన్షింగ్ ఏర్పాటు చేశారు.