Saturday, November 23, 2024

సంసద్ ఆదర్శ గ్రామాల్లో వెన్నంపల్లికి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం

కరీనంగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామం సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్.ఎ.జి.వై) లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పట్టణాలకు ధీటుగా పల్లెలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంసద్ ఆదర్శ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది గ్రామాలతో అభివృద్దిలో పోటిపడి వెన్నంపల్లి గ్రామం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి కరీంనగర్ జిల్లా కీర్తి పథకాన్ని నలుదిశల చాటింది. దేశ వ్యాప్తంగా లోకాసభ, రాజ్యసభ సభ్యులు 2598 గ్రామాలను దత్తత తీసుకోని అన్ని విధాల అభివృద్ది చేయాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ సభ్యులు (ఎం.పి.) అర్థిక సహాయంతో గ్రామాల్లో వివిధ ప్రగతి అంశాలు సూచికగా సంపూర్ణ ప్రగతి సాధించుటకు ప్రోత్సహకాలు అందించారు. దేశవ్యాప్తంగా సంసద్ ఆదర్శ యోజన పథకం క్రింద 248 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేశారు. ఇందులో తొలి పదకొండు గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవే, అందులో 3 గ్రామాలు కరీంనగర్ జిల్లాలోనివి కావడం విశేషం.


పల్లెప్రగతి పథకంతో గ్రామాల అభివృద్దికి బాటలు :
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పలు గ్రామాలు సంసద్ ఆదర్శ గ్రామాలుగా ఎంపిక కావడానికి ఎంతో దోహదపడింది. పల్లె ప్రగతి కార్యకమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 313 గ్రామ పచాయితీలకు 313 ట్రాక్టర్లు, ట్రైలర్లు, ట్యాంకర్లు కొనుగోలు చేశారు. అలాగే 310 గ్రామపంచాయతీలలో వైకుంఠధామాలు, 313 గ్రామాలలో నర్సరీలు, కంపోస్టు షెడ్లు నిర్మించారు. 402 పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీల లో ప్రతిరోజు పకడ్భందిగా పారిశుద్ద్య పనులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రతి ఇంటినుండి తడి పొడి చెత్తను సేకరించేందుకు ట్రైసైకిళ్లు, ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. సెగ్రిగేషన్ షెడ్ల ద్వారా కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నారు. 2021-22 సంవత్సరానికి జిల్లాలోని గ్రామపంచాయతీలలో హరితహారం పథకం కింద 36లక్షలకు పైగా మొక్కలను నాటి గ్రామాలలో పచ్చదనాన్ని నింపారు.


సంసద్ ఆదర్శ్ గ్రామంగా ప్రథమ స్థానంలో నిలిచిన సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ది చేసుకున్నారు. రాజ్యసభ సభ్యులు కెప్టన్ వి. లక్ష్మీకాంత రావు 2014-15 సంవత్సరంలో వెన్నంపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. రూ. 1.50 కోట్లు ఎంపి నిధులు మంజూరు చేశారు. గ్రామంలోని అన్ని కాలనీలలో సిసి రోడ్లు నిర్మించారు. నూతన గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేయగా నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. గ్రామంలో రూ. 4లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రూ. 34.60 లక్షలతో రైతువేదిక, వైకుంఠధామం నిర్మాణాలను పూర్తిచేశారు. గ్రామంలో నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రూ.1కోటి రూపాయలతో సబ్ స్టేషన్ ప్రభుత్వం మంజూరు చేయగా, భవన నిర్మాణ స్థలానికి గ్రామస్థులు రూ. 6.60 లక్షలు విరాళాలు సేకరించి భూమి కొనుగోలు చేసి సబ్ స్టేషన్ నిర్మించుకున్నారు. గ్రామంలో రూ. 20 లక్షలతో మహిళా సంఘ భవనాన్ని నిర్మించుకున్నారు. రూ.16 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య భవనం, మిషన్ కాకతీయ పథకం కింద రూ. 2.90 కోట్ల రూపాయలతో కుంటలు, చెరువులు పునఃనిర్మించుకున్నారు. మిషన్ భగీరథ పథకం కింద 2.20 లక్షల కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన 3 వాటర్ ట్యాంకుల నిర్మాణం చేశారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా ద్వారా త్రాగు నీటిని అందించుటకు రూ. 6.7 కోట్లతో పైపులైన్ నిర్మించారు. గ్రామంలో ప్రతిరోజు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పథకం ద్వారా త్రాగు నీరు సరఫరా చేస్తున్నారు. గ్రామంలో రూ. 25 లక్షలతో సిసిరోడ్లు, రూ. 12 లక్షలతో మురుగు కాలువల నిర్మాణాలు పూర్తి చేశారు. గ్రామంలో ఉపాధి కల్పన పథకం ద్వారా మహిళా సంఘాల కుటుంబ సభ్యులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుటకు 60 మందికి కుట్టు మిషన్ల శిక్షణ ఇప్పించనైనది, గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ప్రాథమిక పశువైద్య కేంద్రం భవనాలు నిర్మించుకున్నారు.

- Advertisement -

గ్రామంలో పెట్రోల్ బంక్ ను కూడా నిర్వహిస్తున్నారు. గ్రామంలో రూ. 65వేలతో తడి పొడి చెత్త బుట్టలను కొనుగోలు చేసి ప్రతి ఇంటికి పంపిణి చేశారు. ప్రజలకు తడి పొడి చెత్తపై అవగాహన కల్పించి ప్రతి రోజు తడి పొడి చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా సెగ్రిగేషన్ షెడ్ కు తరలిస్తున్నారు. ఇలా సేకరించిన తడి పొడి చెత్తను వేరుచేసి కంపోస్టు ఎరువు తయారు చేసుకుంటున్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా గ్రామంలో గత 7విడతలలో 10 వేల మొక్కలను నాటారు. ప్రతిమొక్కకు ట్రిగార్డును అమర్చగా అందులో దాదాపు 96శాతం మొక్కలు బ్రతికినవి, నాటిన ప్రతిమొక్కకు ట్రాక్టర్ ద్వారా నీరు అందిస్తున్నారు. గ్రామంలోని కపిల ఆశ్రమం వారి స్థలంలో నర్సరి పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల పూలు, పండ్లు మరియ నీడ నిచ్చే మొక్కలను కొనుగోలు చేసి నాటించి ప్రకృతి వనాన్ని అందమైన సుందర పార్కులాగా తయారు చేసుకున్నారు. పారిశుద్ధ్య చర్యలలో భాగంగా గ్రామంలోని దాదాపు 6కి.మి.రోడ్లు, 5 కి.మి. మురికి కాలువలను ప్రతిరోజు శుభ్రం చేయించడం జరుగుతున్నది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో శిథిల గృహాలను తొలగించుట, ఖాళీస్థలాలను శుభ్రం చేయించడం జరుగుచున్నది.


ఆదర్శ గ్రామంగా ఎంపికైనందుకు గర్వంగా ఉంది.
గ్రామ సర్పంచ్ అబ్బిడి పద్మ
తమ వెన్నంపల్లి గ్రామం సంసద్ అదర్శ్ గ్రామయోజన పథకం క్రింద దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచినందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని గ్రామ సర్పంచ్ అబ్బిడి పద్మ ఆనందం వ్యక్తం చేశారు. వెన్నంపల్లి గ్రామంలో 534 ఇండ్లు 2167 జనాభా గల తమ గ్రామాన్ని రాజ్యసభ సభ్యులు కెప్టన్ లక్ష్మీకాంత రావు దత్తత తీసుకున్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యులు కెప్టన్ లక్ష్మీకాంత రావు, శాసన సభ్యులు ఒడితెల సతీష్ కుమార్ ల సహాయ సహకారాలు, ప్రోత్సాహంతో వార్డు సభ్యులు, గ్రామ ప్రజల పూర్తి సహయ సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ది పథంలో నడిపించేందుకు కృషిచేశామని అమె తెలిపారు. తమ శ్రమ ఫలించి జాతీయ స్థాయిలో వెన్నంపెల్లి గ్రామం సంసద్ ఆదర్శ్ గ్రామంగా మొదటి స్థానం పొందడం చాలా సంతోషంగా ఉందని సర్పంచ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకుని నిధులు మంజూరు చేసిన ఎంపి కెప్టన్ లక్ష్మీకాంత రావుకు, ప్రతినెలా నిధులు మంజూరు చేస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రావు కు తమ గ్రామ ప్రజలందరూ ఎల్లవేళలా రుణపడి ఉంటారని సర్పంచ్ పద్మ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement