నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేస్తున్నామని పెద్దపల్లి డీసీపీ రూపేష్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కూడలిలో వాహనాల తనిఖీ నిర్వహించి నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేయడంతో పాటు ధృవీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ… ఇకపై ప్రతి రోజూ వాహనాల తనిఖీ నిర్వహిస్తామన్నారు. వాహన దారులు తప్పని సరిగా రవాణా శాఖ నిబంధనలు పాటించాలన్నారు.
మైనర్ లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో స్పీడ్ గన్ లు ఏర్పాటు చేశామని, అతి వేగంగా వెళితే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు జరిమానాలు తప్పవన్నారు. తనిఖీల్లో సిఐ లు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఎస్ఐ లు రాజేష్, శ్రీనివాస్, దత్తు తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.