కరీంనగర్ జిల్లాలో మాతా శిశు సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళుతూ, WASH (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) , అనేమియా ముక్త్ కరీంనగర్ కార్యక్రమాలను వినూత్న రీతిలో నిర్వహిస్తు, ఇటీవలనే కరీంనగర్ ఓడిఎఫ్ ప్లస్ లో , జాతీయస్థాయిలో 5స్టార్ రేటింగ్ సాధించిన సందర్భంగా యూనిసెఫ్ జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రశంసించారు. కరీంనగర్ జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ కి యూనిసెఫ్ 2016 నుండి సహకారం అందిస్తూ వస్తుంది. పల్లె ప్రగతి స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా అధికారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగర్ జిల్లా స్వచ్ఛత లో జాతీయస్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని, యూనిసెఫ్ కూడా తమ వంతు సహకారం అందిస్తూ, ఈ అవకాశాన్ని కల్పించడం జిల్లాకు గర్వకారణం అని జిల్లా కలెక్టర్ కర్ణన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సోమవారం హైదరాబాద్ యూనిసెఫ్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ కు చెందిన పలువురు యూనిసెఫ్ భాగస్వాముల సమక్షంలో యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం నుండి భారత దేశం ప్రతినిధి శ్రీమతి సైంతియా ఎంసీకాఫీరె హైదరాబాద్ చీఫ్, మిస్ మెయిటల్ రూసడియా TSCPCR చైర్మన్ శ్రీనివాసరావు, WASH ఆఫీసర్ వెంకటేష్ తదితరులు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అనీమియా ముక్త్ కరీంనగర్ కార్యక్రమంను పగడ్బందీగా అమలు చేస్తూ చాంపియన్ గా పనిచేస్తున్నారని కొనియాడుతూ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రత్యేకించి కరీంనగర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద అమలవుతున్న దళిత బంధు, అనిమీయా ముక్త్ కరీంనగర్, పోషణ అభియాన్, మన ఊరు మన బడి ఆరోగ్య – మహిళా సంక్షేమం- గ్రామీణాభివృద్ధి- పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో చేస్తున్న కృషి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో యూనిసెఫ్ , స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ చేస్తున్న కార్యక్రమాల బుక్ లెట్ ను ఆవిష్కరించారు. కలెక్టర్ వెంట కరీంనగర్ జిల్లా యూనిసెఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కిషన్ స్వామి , క్లస్టర్ ఫెసలిటేటర్ రవీందర్ పాల్గొన్నారు..