Saturday, November 23, 2024

ఆడపడుచులకు అండగా ప్రభుత్వం..

పెద్దపల్లి ‌: ఆడపడుచులకు అండగా తెరాస ప్రభుత్వం నిలుస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో పెద్దపల్లి మండలానికి చెందిన 131 మందికి రూ. కోటి 23లక్షల 5196ల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ నిరుపేద కుటుంబాలకు వరంలాంటిదని కొనియాడారు. నిరుపేద కుటుంబాలలోని ఆడపిల్లల పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరాగా నిలిచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా పెళ్లి కానుకగా రూ. లక్షా 116 ఆర్థికసాయం అందిస్తుందన్నారు. కళ్యాణలక్ష్మి కింద 126 మందికి, షాదీముబారక్‌ ద్వారా ఐదుగురికి పెద్దపల్లి మండలంలో చెక్కులు అందించామన్నారు. పేదింటి కుటుంబాల మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తోందన్నారు. తెలంగాణలో సుపరిపాలన యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రజలకు మౌళిక వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్పీటీసీ రామ్మూర్తి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ మాదిరెడ్డి నర్సింహరెడ్డితోపాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement