Tuesday, November 19, 2024

TS: రైతుల పేరిట దొంగ దీక్షలు.. మంత్రి శ్రీధర్ బాబు

..కాలేశ్వరంతో చుక్కనీరు రాలే
… పత్తిపాక పూర్తి చేయకపోతే ఓట్లు అడగం
.. ప్రకృతి వైపరీత్యంతోనే కరువు
… ఇప్పటికే 40 కోట్ల ఫ్రీ టికెట్లు

పెద్దపల్లి (ప్రభ న్యూస్) : పదేళ్ల బారాస పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రైతుల పేరిట బీఆర్ఎస్ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… కాలేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది తప్ప పెద్దపల్లి జిల్లాకు చుక్క నీరు రాలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎంతో మంది రైతులు భూములు, ఉపాధి కోల్పోయారన్నారు. పదేళ్లపాటు రైతుల కష్టాల గురించి ఆలోచించని బారాస నేతలు రైతుల పేరిట దొంగ దీక్షలు చేయడం సిగ్గుచేటన్నారు.

జిల్లాలో రైతులు పండించిన పంటకు బస్తాకు ఐదు కిలోల చొప్పున తరుగు తీసినప్పుడు మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఏం చేశారని ప్రశ్నించారు. అప్పుడు స్పందించని ఈశ్వర్ ఇప్పుడు రైతుల కోసం దొంగ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాబోయే ఐదేళ్లలో పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకపోతే ఓట్లు అడగమ‌ని, పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేయకపోతే తనతోపాటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఓట్లు అడగమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదన్నారు. 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు మహిళల‌ ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పటికే 40 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేశామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10లక్షల రూపాయలకు పెంచామన్నారు. ప్రతి గ్యారెంటీని అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్లో హామీలన్నింటికీ నిధులు కేటాయిస్తామన్నారు.

ప్రకృతి వైపరీత్యం వల్ల కరువు ఏర్పడితే ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ తెచ్చిన కరువుగా అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మోడల్ ఎమ్మెల్యే అని, జెన్కో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం గత 100 రోజుల్లో వెయ్యి సార్లు ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రితో పాటు సహచర మంత్రులందరినీ అడిగారన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ఇప్పుడు చేస్తామని, సింగరేణి నిధులను ఈ ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చించేందుకు ప్రయత్నిస్తామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసుగు చెందిన తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారం కట్టబెట్టారన్నారు. నాలుగు నెలలు గడవకముందే, ఓపికతో వ్యవహరించాల్సిన ప్రతిపక్షం ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేయడం తగదన్నారు.

- Advertisement -

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విద్యావేత్త గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ… తన తాత వెంకట స్వామి సింగరేని అభివృద్ధి కోసం ఎంతో చేశారని, గూడు లేని ఎంతోమందికి ఇల్లు కట్టించారన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవలు అందించటంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు విజయ రమణారావు, కాంగ్రెస్ నాయకులు హారకర వేణుగోపాల్, బాబర్ సలీం పాషా, జనప్రసాద్, వెంకట్రావు రాజేష్ లతోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement