Sunday, June 30, 2024

KNR: నూతన చట్టాలపై అవగాహన ఉండాలి.. సీపీ శ్రీనివాస్‌

ముగిసిన నెల రోజుల శిక్షణా తరగతులు
గోదావరిఖని, జూన్‌ 27 (ప్రభ న్యూస్‌): దేశంలోని నూతన చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ అన్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం- 2023పై పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పోలీస్‌ అధికారులు, సిబ్బందికి నెల రోజులపాటు నిర్వహించిన శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి. అడిషనల్ డీసీపీ రాజు ఆధ్వర్యంలో కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్‌ హాజరై అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎన్‌ఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టాలు అమలులోకి వస్తున్నాయన్నారు. ప్రతీ పోలీస్‌ అధికారి, సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నెలరోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించామని తెలిపారు.

కొత్త చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది కొత్త చట్టాలను నేర్చుకొని అవగాహన పెంచుకోవాలని సూచించారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా నూతన చట్టాలపై పోలీసు అధికారులు, సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహించి, శిక్షణా తరగతుల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులను అభినందించారు.

నెల రోజులపాటు సమయపాలన పాటిస్తూ అందరికీ అర్థమయ్యేలా తరగతులు బోధించిన ఏసీపీ మల్లారెడ్డి, రామగుండం ట్రాఫిక్‌ ఇన్స్పెక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌, ఎస్‌ఐలు రాజేష్‌, వినీత, సంతోష్‌, సిబ్బంది హెడ్‌ కానిస్టేబుల్‌ పి.వంశీకృష్ణ, బి.శ్రీనివాస్‌, కే రాము, ఏ సంతోష్‌, కే.శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ కే తిరుపతి, ఎన్‌.శ్రీనివాస్‌ లను సీపీ ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్స్‌ రాజు, స్పెషల్‌ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, రామగుండం ట్రాఫిక్‌ ఇన్స్పెక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌, ఎస్‌ఐలు రాజేష్‌, వినీతలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement