Tuesday, November 19, 2024

Karimnagar | మూడు గంటల్లోనే చోరీ కేసును చేదించిన పోలీసులు..

కరీంనగర్ క్రైమ్, (ప్రభా న్యూస్) : ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డ ఇద్దరు దొంగలను కరీంనగర్ రూరల్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళల నుండి ద్విచక్ర వాహనం పై ఇద్దరు వ్యక్తులు వచ్చి మెడలోని గొలుసు అపహరించుకొని వెళ్లారు.

ఈ మేరకు బాధితురాలు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మూడు గంటల్లోనే చోరీకి పాల్పడ్డ ఎలబోతారం గ్రామానికి చెందిన ఎడవల్లి దీపక్, ఎడవల్లి చందు లను అదుపులోకి తీసుకొని విచారించారు.

జల్సా లకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని నగరం పరిధిలోని సీతారాంపూర్, మెహర్ నగర్, నగునూరు, వావిలాలపల్లి, గోపాల్ పూర్, జ్యోతి నగర్, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళల ను టార్గెట్ చేసి మోటార్ సైకిల్ పై వచ్చి చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు గుర్తించారు.

దొంగతనం చేసిన బంగారాన్ని కొనుగోలు చేసిన బంగారం షాప్ యజమాని సింహరాజు నరేష్ ను అదుపులోకి తీసుకోవడంతోపాటు అతని వద్ద నుండి 105.85 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు ఉపయోగించిన బుల్లెట్ బండితోపాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం కరీంనగర్ ఏసిపి వెంకట్ రమణ మీడియా సమావేశం నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలియజేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిని చాక ముఖ్యంగా పట్టుకొని చోరీ సొత్తును రికవరీ చేసిన కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ఎస్సై లక్ష్మారెడ్డి, ఏ ఎస్ ఐ రాజయ్య, సిబ్బంది సలావుద్దీన్ రమేష్, దయానంద్, కనకయ్య, శ్రీను లను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement