Wednesday, November 20, 2024

తీరు మారకపోతే పీడీ యాక్టు తప్పదు : పెద్దపల్లి ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ మహజన్‌

గోదావరిఖని టౌన్ : సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించే రౌడీ షీటర్లు తమ తీరు మార్చుకోకపోతే పీడీయాక్టు పెట్టక తప్పదని పెద్దపల్లి ఇన్‌చార్జి డిసిపి అఖిల్‌ మహాజన్‌ హెచ్చరించారు. మంగళవారం గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సబ్‌ డివిజన్‌ పరిధిలో గల 60 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన రౌడీ షీటర్ల జీవన విధానంతో పాటు, ప్రస్తుత వారి కుటుంబ స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు నేర ప్రవృత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలని సూచించారు. శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగిస్తూ దాడులకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పిడి యాక్ట్‌ పెట్టేందుకు సైతం వెనకాడమన్నారు. పోలీస్‌ శాఖ నిరంతరం రౌడీ షీటర్ల కదలికలు, ప్రవర్తనపై నిఘా ఉంచుతుందన్నారు. చట్టవిరుద్ధంగా పని చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. గతంలో చట్టవ్యతిరేక కార్యక్రమాలు పాల్పడి పలు నేరాల్లో పాలుపంచుకున్న వ్యక్తులపై రౌడీషీట్స్‌, సస్పెక్ట్‌ షీట్లు తెరిచామని, ప్రస్తుతం కోర్టులో ట్రయల్‌ నడుసున్న రౌడీ షీట్లకు శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. ఈ సమావెశంలో ఏసీపీ గిరి ప్రసాద్‌, వన్‌టౌన్‌ ఇన్స్పెక్టర్‌లు రమేష్‌ బాబు, రాజ్‌ కుమార్‌, టూటౌన్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీనివాస్‌ రావు, మంథని సీఐ సతీష్‌, రామగుండం సీఐ లక్ష్మి నారాయణ, సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement