Friday, November 22, 2024

సింగరేణి అభివృద్ధిలో కార్మికులదే ప్రధాన పాత్ర‌.. ఎమ్మెల్యే కోరుకంటి చందర్

సింగరేణి అభివృద్ధి చెందడానికి కార్మికుల పాత్రే ప్రధానమైనదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం ఆర్జీ-1 పరిధి 2ఎ బొగ్గు గని ఆవరణలో ఏర్పాటు చేసిన కార్మికుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శతాబ్దం చరిత్ర కలిగిన సింగరేణి అభివృద్ధికి కార్మికులు ఎనలేని కృషి చేశారన్నారు. కార్మికులు స్వంత ఊరును వదిలేసి, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణిలో చేరి దేశాభివృద్ధిలో భాగమవుతున్నారన్నారు. కుటుంబం కోసం, విధి నిర్వహణ కోసం జీవితాలను త్యాగం చేస్తున్నారన్నారు. సింగరేణి యాజమాన్యానికి అత్యధిక లాభాలు రావడంలో కార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికుల పక్షాన ఆలోచించి, పదవీ విరమణ కాలాన్ని మరొక సంవత్సరానికి పెంచి.. వారి ఆర్థిక అభివృద్ధికి సహకరించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు, కార్మికులకు ఇంక్రిమెంట్లు ఇచ్చారన్నారు. సింగరేణి కార్మికుల హక్కు అయిన వారసత్వపు హక్కును, మళ్లీ అమలయ్యేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సింగరేణి క్వార్టర్స్ లో నివాసముంటున్న కార్మికులకే, ఆ క్వార్టర్లను శాశ్వతంగా కేటాయించే విధంగా కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారన్నారు. ప్రజల గుండెల్లో కొలువైన కేసీఆర్ పై బురదజల్లడం కోసం కొంతమంది మూర్ఖపు నాయకులు యాత్రలపేరుతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనను యావత్ భారతావని కోరుకోవడంలోనే ఆయన ప్రజా సంక్షేమ పాలన మనకు అర్థమవుతుందన్నారు. ఇన్ని సంవత్సరాలుగా క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో విధులను నిర్వహించి, పదవీ విరమణ పొందుతున్న కార్మికులు ఇకపై తమ పూర్తి సమయాన్ని కుటుంబానికి వెచ్చించాలని, ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఆనందమైన జీవితాన్ని గడపాలని ఆయన సూచించారు. అలాగే గనిలో ఏర్పాటుచేసిన మ్యాన్ రైడింగ్ సిస్టం త్వరలోనే వినియోగంలోకి వస్తుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు, నాయకులు, గని కార్మికులు దొరగండ్ల మల్లయ్య, దాసరి నర్సయ్య, శేషగిరి, రియాజ్, శ్యాంసన్, రాజు, కళాధర్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్, వెంకటేష్, కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు పర్లపల్లి రవి, కాల్వ శ్రీనివాస్, దొమ్మేటి వాసు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement