Tuesday, November 26, 2024

నియంత పాలనకు ఆ కుటుంబమే నిదర్శనం.. జెండా మోసిన వారిని మోసం చేశారు: పుట్ట మధు

మంథని, (ప్రభన్యూస్‌): నియంత పాలనకు ఆ కుటుంబమే నిదర్శనమని, 40 ఏండ్లలో ఒక్కరికి పదవులు ఇవ్వని కుటుంబమని, జెండా మోసిన వారిని మోసం చేసిన చరిత్ర మంథని కాంగ్రెస్‌ పార్టీదని పెద్దపెల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ, భూపాలపల్లి జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌లతో కలిసి నియోజకవర్గంలో ఎంతో మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుల ప్రస్తుత దుస్థితిపై ఆయన వివరించారు. పార్టీనే నమ్మకున్న అజీంఖాన్‌ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందని ప్రశ్నించారు.

కిషన్‌ రెడ్డి ని గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర నిజం కాదా, నాతోపాటు నా వెంట ఉన్న వారికి పదవులు ఉండాలన్నదే నా లక్ష్యం అంతే కానీ నేనొక్కడినే ఎదగాలనుకునే లక్షణం నాకు లేదన్నారు పుట్టా మ‌ధు. బహుజనులకు రాజ్యాధికారం వచ్చే వరకు పోరాటం ఆగదని, 75 ఏండ్ల స్వాతంత్య్రంలో 40 ఏండ్లపాటు నియోజకవర్గంలో తండ్రి కొడుకుల పాలనలో పార్టీ కోసం పనిచేసిన ఒక్క నాయకుడు, ఒక్క కార్యకర్తకు పదవులు ఇవ్వకుండా నియంత పాలనకు నిదర్శనంగా నిలిచారన్నారు. ఎంతో మంది నాయకులు, కార్యకర్తల జీవితాలతో చెలగాటం ఆడిన చరిత్ర వారికే దక్కుతుందన్నారు.

పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులకు పదవులు ఇస్తే ఎక్కడ ఎదిగిపోతారన్న ఆలోచనతో నియోజకవర్గంలో నియంత పాలనకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ పాలకులు ఎంతో మంది కాంగ్రెస్‌ నాయకుల ఉసురుపోసుకున్నారన్నారు. మంథని మున్సిపల్‌ పరిధిలోని సీనియ ర్ నాయకుడు అజీంఖాన్‌ ఇప్పటికి కాంగ్రెస్‌ జెండా మోస్తున్నాడని, అలాంటి మైనార్టీ నాయకుడికి ఇప్పటి వరకు ఒక్క పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రతి కార్యకర్త ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement