Thursday, November 21, 2024

భూమి కోసం దారుణం… తాతను చంపిన మనుమలు…

పెద్దపల్లి : భూమి కోసం ఆశ పడి తాతనే చంపిన మనమలను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విడియా సమావేశంలో ఏసీపీ సారంగపాణి వివరాలను వెల్లడించారు. సుల్తానాబాద్‌ పట్టణానికి చెందిన జంగా లింగయ్య అనే రిటైర్డ్‌ సింగరేణి ఉద్యోగికి ఇద్దరు కూతుర్లు రాజమ్మ, వరలక్ష్మి ఉన్నారన్నారు. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌ గ్రామంలో 2.18 ఎకరాల భూమి ఉండగా, పెద్ద కూతురు రాజమ్మకు వ్యవసాయం కోసం ఇచ్చాడన్నారు. గత ఏడాది క్రితం ఇద్దరు కూతుళ్లు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున రిజిస్ట్రేషన్‌ చేయించాడన్నారు. ఈ క్రమంలో పెద్ద కూతురు కూతురు అనిత పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయాలని చెప్పడంతో ఆమె పేరునే చెయించాడన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద కూతురు కుమారులు నర్ల సంతోష్‌, రవిలు లింగయ్య మొత్తం భూమిని సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో గత పది నెలల క్రితం బ్యాంకు లోన్‌ పేరుతో సాక్షి సంతకం కావాలని తెల్ల బాండ్‌ పేపర్లపై లింగయ్య వేలిముద్రలు తీసుకొని రూ. 14.70 లక్షలకు మొత్తం 2.18 ఎకరాల భూమిని సంతోష్‌కు అమ్మినట్లు డాక్యుమెంట్‌ రాసుకున్నాడన్నారు.

అప్పటి నుంచి ఈ భూమి విషయంలో గొడవలు చేస్తూ చిన్న కూతురు వరలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులను భూమి వద్దకు రాకుండా బెదిరిస్తూ గతంలో దాడికి కూడా పాల్పడగా, కేసులు కూడా నమోదయ్యాయన్నారు. తరచూ గొడవలు జరుగుతుండడంతో లింగయ్య, అతని భార్య ఓదెమ్మలను చంపితేనే భూమి మొత్తం సొంతమవుతుందని భావించి ఈనెల 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంతోష్‌, రవిలు లింగయ్య, ఓదెమ్మలపై కర్రలతో దాడి చేసి బైక్‌పై పారిపోయాడన్నారు. ఈ దాడిలో గాయపడ్డ లింగయ్య కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మృతిచెందగా, ఓదమ్మ ఆస్పత్రిలోనే ఉందన్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని సీఐ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో మూడు ప్రత్యేక టీమ్‌లు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారన్నారు. వారి వద్ద నుంచి బైక్‌తోపాటు దాడికి ఉపయోగించిన కర్రను స్వాధీనం చెసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై ఉపేందర్‌, అశోక్‌ రెడ్డి, ఏఎస్‌ఐ తిరుపతి, పోలీస్‌ కానిస్టేబుల్‌ తిరుపతి, గణేష్‌, అనిత్‌, మల్లేశం, నవీన్‌, ఇతర సిబ్బందిని ఏసీపి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement