Saturday, November 23, 2024

టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మున్సిపల్‌ చైర్మన్‌..

టెండర్‌ ద్వారా దక్కించుకొని అభివృద్ధి పనులు చేపట్టని కాంట్రాక్టర్ల దరావత్తు రద్దు
57అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య సిబ్బంది యూనిఫాంలకు పరిపాలన అనుమతి
నూతన రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణానికి కౌన్సిల్‌ ఆమోదం
టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా మంచిర్యాల పురపాలక సాధారణ సమావేశం

మంచిర్యాల : పురపాలక సాధారణ సమావేశం కరోనా వైరస్‌ దృష్ట్యా భౌతికంగా నిర్వహించకుండా టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 57 అంశాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. పార్కుల అభివృద్ధితో పాటు వివిధ వార్డుల్లో మౌళిక వసతుల కల్పన కోసం పనులు చేపట్టడం కోసం సమావేశంలో మెజార్టీ కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. మున్సిపాలిటీలో వివిధ స్కీంల ద్వారా టెండర్లను పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించిన 9 పనులకు సంబంధించి పనులు చేపట్టనందుకు ఆ కాంట్రాక్టర్ల దరావత్తు సొమ్మును రద్దు చేయడంతో పాటు ఆ పనులను కూడా రద్దు చేసి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ప్రజా ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్‌ సిబ్బందికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.11 లక్షలతో యూనిఫాం, చెప్పులు, నూనె, సబ్బులు, ఎలక్ట్రికల్‌ టూల్‌ కిట్లు, రేయిన్‌ కోట్లు, తదితర వస్తువుల కోసం పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. మంచిర్యాల రైల్వే స్టేషన్‌ వద్ద గల రైల్వే కిలోమీటర్‌ నెంబర్‌ 261-41-43 వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం అనుమతి ఇస్తూ అది పూర్తయిన వెంటనే లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ నెంబర్‌ 56ను శాశ్వతంగా మూసివేయటానికి అభ్యంతరం లేదని తెలుపుతూ మున్సిపల్‌ పాలకవర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా మార్కెట్‌ ఏరియాలోని డి-3 షాపును తిరిగి వేలం వేసేందుకు అనుమతికి మంజూరు చేసింది. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement