Thursday, November 21, 2024

TS: తెలంగాణ గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామా… చైర్ పర్సన్ అరుణ

సిరిసిల్ల, సెప్టెంబర్ 16 (ప్రభన్యూస్) : సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ వల్లే తెలంగాణ గ్రామాలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామా లాగా నిలుస్తున్నాయని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2023 క్రింద జిల్లా స్థాయిలో మూడు కేటగిరీలలో ఎంపికైన 15ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, సెక్రెటరీలను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవతోనే జిల్లాలోని గ్రామాలు అభివృద్ధి బాట పట్టి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు చేజిక్కించుకుంటున్నాయన్నారు. పల్లెలు దేశానికే పట్టుగొమ్మలు అని తెలంగాణ పల్లెలు నిరూపించాయన్నారు. ఏ గ్రామ పంచాయితీలో కూడా సెక్రెటరీ లేకుండా ఉండాలని సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని ప్రతి గ్రామ పంచాయితీ కి సెక్రెటరీ ని నియమించారన్నారు.

ఇప్పుడు ఏ పల్లె చూసినా పచ్చదనం, పరిశుభ్రతతో అలరాలుతున్నాయంటే సిఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. సిఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఇవ్వాళ తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ… రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం ఉండాలని సిఎం కేసీఆర్ తెలంగాణకు హరితాహరం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో పాటు స్వచ్చమైన రక్షిత త్రాగునీరు అందివ్వాలని సిఎం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తెలంగాణ పల్లెలు పరిశుభ్రత, పచ్చదనం విషయంలో దేశానికే ఆదర్శంగా, నమూనాగా ఉన్నాయని తెలిపారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యులైన స్థానిక ప్రజా ప్రతినిధులు, సెక్రెటరీ లకు అభినందనలు తెలిపారు.

జిల్లా ప్రజా పరిషత్ వైస్ ఛైర్మన్ సిద్దం వేణు మాట్లాడుతూ… పల్లెలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందని సిఎం కేసీఆర్, పంచాయితీ రాజ్ మంత్రి కేటీఆర్ లు నమ్మి పల్లెల బాగుకోసం కష్టపడ్డారని చెప్పారు. గ్రామానికో ట్రాలీ, ట్రాక్టర్, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశారని అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… జాతీయ పంచాయతీ అవార్డులలో తెలంగాణకు 13అవార్డులు రావడం, పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణలో ఒకప్పుడు ఆదర్శ గ్రామం అంటే గంగదేవి పల్లె గుర్తు వచ్చేదని, ఇప్పుడు తెలంగాణలో ప్రతి గ్రామం గంగదేవి పల్లె అయిందన్నారు. జిల్లాలో 255 గ్రామ పంచాయితీలు బాగా పని చేస్తున్నాయన్నారు. రాష్ర్టంలో 7శాతం పచ్చదనం పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. 2018 సంవత్సరంలో తెచ్చిన నూతన పంచాయితీ చట్టం కూడా పల్లెల అభివృద్ధికి దోహదం చేసిందన్నారు. స్వచ్చత హి సేవా కార్యక్రమంలో కూడా జిల్లా పంచాయితీలు ముందు వరుసలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్, నక్క శ్రీనివాస్, స్వచ్ఛ భారత్ మిషన్ బాధ్యులు సురేష్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement