కరీంనగర్ : ఈ వానాకాలం కోటీ యాబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో యాబై లక్షలు ఇతర అవసరాలకు తీసుకోగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో ప్రక్రియ ప్రారంభించామని సివిల్ సప్లైశాఖ మంత్రి గుంగల కమలాకర్ అన్నారు. నేడు స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి కరీంనగర్ నియోజకవర్గంలోని నగునూర్, చామనపల్లి, చర్లబుత్కూర్, దుర్శేడ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించి వివరాలు వెల్లడించారు. 2014కు ముందు కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే నేడు కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గర్వకారణమన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పండాలంటే అవసరమైన నీళ్లు, పెట్టుబడి, కరెంటు, ఎరువులు సకాలంలో అందించారని, గతంలో మార్కెటింగ్ చేసుకోవడంలోనూ రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, కేంద్రం నూకలు తినాలని, మేం కొనమని ఖరాఖండిగా చెప్పినా… రైతు పండించిన ప్రతీ గింజను కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. గతంలో శ్రీలంక లాంటి దేశాలు ఎదుర్కొన్న ఆహార సంక్షోభం చూసామని, కనీసం దాన్ని పట్టించుకోకుండా ముందు చూపు లేకుండా రైతుల పంటలపై చిన్నచూపుతో వ్యవహరించిన తీరుతో కేవలం ఆరు నెలల్లోనే కేంద్రం వద్ద నిల్వలు కొరత ఏర్పాడ్డాయని దుయ్యబట్టారు. బాబాసాహెబ్ చెప్పిన ఆహార భద్రతను గాలికొదిలి పూర్తి వ్యాపారిలా వ్యవహరించే కేంద్రం ఉండడం దురదృష్టమన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో భూమి మేయలేని విధంగా పంటను పండించామని, కానీ దీన్ని అడ్డుకునే విధంగా ర్యాంకు మూమెంట్ ఇవ్వకా, గోడౌంన్లు కేటాయించక, ఎఫ్సిఐ వంటి సంస్థలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడం దారుణమని మంత్రి గంగుల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6713 కొనుగోలు కేంద్రాల ప్రతిపాదించామని, ఇప్పటివరకూ 1545 కేంద్రాలు ప్రారంభించి దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల్ని సేకరించామని వీటికి సాదారణ రకం 2040, మేలురకం 2060 మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తామన్నారు. నిధుల కొరత లేదని, గన్నీలు, ప్యాడీక్లీనర్లు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లతో పాటు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement