సీసీ కెమెరాలతో నేరాలను నిషేధించాలి
రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి
గోదావరిఖని : సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పరిశోధనను ఉపయోగించి నేరాల నియంత్రణలో సమగ్ర విచారణ చేయడం ద్వారా సాక్ష్యాధారాలతో నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అధికారులతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేయాలని, తద్వారా చట్ట పరిధిలో నిందితులకి కఠినమైన శిక్షలు పడేలా చూడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై, ఫోరెన్సిక్ సైన్స్‌పై, శాస్త్రీయ ఆధారాలపై, కేసుపై పూర్తి పట్టు సాధించి నేర పరిశోధనలు చేయాలన్నారు. సమయానుకూలంగా విధులు నిర్వర్తిస్తూ ప్రొయాక్టీవ్ పోలీసింగ్‌తో విధులు నిర్వహించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకు వెళ్లాలన్నారు. స్టేషన్‌లో సిబ్బందికి ఎప్పటికపుడు సరైన సూచనలు ఇస్తూ ప్రతి ఒక్కరు తాము చేసే విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్‌లో తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఫంక్షన్ వర్టీకల్స్, 5ఎస్ ఇంప్లిమెంటేషన్ తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. నేర విచారణ అధికారి కేసులలో శిక్షలు పడే విధంగా పరిశోధన చేయాలని, ప్రతి దరఖాస్తులో పారదర్శకంగా విచారణ చేసి నివేదికను సీసీటీఎన్‌ఎస్‌లో ఆన్‌లైన్ అప్‌లోడ్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లో మొక్కలు నాటాలని, ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చూడాన్నారు. వర్టికల్స్ అమలు పట్ల అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ, వాటి పట్ల అవగాహన ఉన్నప్పుడే సత్ఫలితాలు సాధ్యమన్నారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో విచారణ పూర్తిగా చేసి, అవసరమైన సాక్ష్యాలు ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టి శిక్షపడేలా పని చేయాలన్నారు. ఉన్నత అధికారులు అప్పగించిన విధులను అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించి ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరిగేలా చూడాలని తెలిపారు. ఈకార్యక్రమంలో అడ్మిన్ డిసిపి అఖిల్ మహాజన్, సిసిఆర్ బి ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, పాషా, పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లోని ఎస్‌హెచ్‌ఓలు, ఐటి కోర్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ రాము, సిబ్బంది పాల్గొన్నారు.