శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరించారు. ఈనెల 19న రాత్రి స్థానిక కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పెన్సార్ మాల్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయన్నారు. ఇరువురికి, ఒకరికొకరికి ఎటువంటి పరిచయం కానీ, పాత కక్ష్యలు కానీ లేవన్నారు. అనుకోని తప్పిదం వల్ల జరిగిన ఆక్సిడెంట్ మాత్రమే అన్నారు. ఈ ఘటనలో అక్కడే వున్నకొంతమంది చట్టాన్ని అతిక్రమించి గుమిగా ఏర్పడి ఆక్సిడెంట్ కు కారణమైన వ్యక్తిపై ఇష్టారీతిన దాడి చేయడమే కాకుండా, అతని మోటార్ సైకిల్ ని తగలబెట్టేందుకు ప్రయత్నిచారన్నారు.
సంఘటన జరిగినదని తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, బ్లూకోల్ట్ సిబ్బంది చేరుకొని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వారి మాట వినకుండా దుర్భాషలాడుతూ, విధులకు ఆటంకం కలిగించారన్నారు. ఈ సంఘటనకు సంబంధించి కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు బాధ్యులపై మూడు కేసులు నమోదు చేశామని, విచారణ ఇంకా కొనసాగుతుందన్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉందని ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామన్నారు.