శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని, కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు తెలియజేశారు. శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మిలాద్ ఉన్ నబి పండుగ కోసం శుక్రవారం చేసే ర్యాలీకి కరీంనగర్ లోని మర్కజీ మిలాద్ కమిటీ అనుమతి కోరిందని, దాన్ని పరిశీలించిన సంబంధిత పోలీస్ అధికారులు నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారం పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చామన్నారు. కానీ మిలాద్ ఉన్ నబి ర్యాలీలో పాల్గొన్న కొందరు యువకులు పోలీస్ శాఖ ఇచ్చిన రూట్ మ్యాప్ లో కాకుండా, అనుమతి పరిమితులని అతిక్రమించి ఒక గుంపుగా ఏర్పడి కరీంనగర్ పలు వీధుల్లో ర్యాలీగా తిరగటం జరిగిందన్నారు. అందులో భాగంగానే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆఫీస్ వీధిలో కూడా ర్యాలీగా వెళ్ళటం జరిగిందన్నారు. ఈ సంఘటన గురించి బీజేపీ పార్టీకి చెందిన కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కరీంనగర్ పోలీసులకు తమ పార్టీ ఆఫీసుపై దాడి జరిగిందని భాద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారన్నారు.
తక్షణమే స్పందించి విచారణ చేపట్టామని ఆ సంఘటన ప్రదేశంలో వున్న ప్రత్యక్ష సాక్షులని, సీసీ కెమెరాలను కూడా పరిశీలించామన్నారు. మిలాద్-ఉన్-నబి ర్యాలీకి చెందిన యువకులు కొంత మంది ఒక గుంపుగా ఆ వీధిలో మాత్రమే వెళ్లారని, ఎటువంటి దాడి చేసినట్లుగా విచారణలో ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఇచ్చిన రూట్ మ్యాప్ లో కాకుండా అనుమతి పరిమితులు అతిక్రమించి గుంపుగా ఏర్పడి ర్యాలీగా తిరిగిన 15మంది యువకులను గుర్తించి వారిపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశామన్నారు. వారి వాహనాలను కూడా సీజ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులు బీజేపీ పార్టీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారని, భాద్యులని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపినా వినకుండా బీజేపీ ఆఫీసులో గల వ్యక్తులు, కార్యకర్తలు నిరసనగా, గుంపుగా ఏర్పడి చేతుల్లో కట్టెలు తీసుకుని రోడ్లపైకి వచ్చి ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలకు పాల్పడ్డారన్నారు.
అక్కడున్న పోలీసు వారితో దురుసుగా ప్రవర్తించి వాగ్వివాదానికి దిగి పోలీస్ విధులకు ఆటకం కలిగించిన వారిని కూడా గుర్తించి భాద్యులపై చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిని కుడా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కరీంనగర్ లోని అన్ని మతాలకు చెందిన ప్రజలు వారి వారి పండుగలను శాంతియుత వాతావరణంలో సోదర భావంతో జరుపుకోవాలని అన్నివర్గాల మత పెద్దలను పలుమార్లు సమావేశపరచి సూచించామన్నారు. ఏవైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా లేక ఏదైన వర్గానికి చెందిన వారికి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే చర్యలకు పాల్పడవద్దని పలుమార్లు తెలిపామన్నారు.
దీనికనుగుణంగానే కరీంనగర్ ప్రజలంతా అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నారన్నారు. ఈ సంప్రదాయాన్ని భవిష్యత్తులో కొనసాగించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై, చట్టాన్ని ఉల్లంఘించి వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో మత ఘర్షణలకు దారితీసే పోస్టులు పెట్టడం, దుష్ప్రచారాలు చేసే ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదని, ప్రజల శాంతి భద్రతలే ముఖ్యమని, వాటికి విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల చట్ట పరిధిలో చాలా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.