Friday, November 22, 2024

రాజన్న క్షేత్రంలో మరోసారి లాక్‌డౌన్‌..!

వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో మరోసారి లాక్‌ డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఇటీవలే శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి సన్నిధిలో నిర్వహించిన శివ కళ్యాణం మహోత్సవానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివ కళ్యాణోత్సవానికి భక్తులను అనుమతించడం లేదని ఆలయ అధికారులు ప్రకటించినప్పటికీ పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. శివ కళ్యాణం అనంతరం వేములవాడ పట్టణం, పరిసర గ్రామాలలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. శ్రీరామనవమి ఉత్సవాలను ఆలయంలోపల నిర్వహించాలని భక్తులకు అనుమతి లేకుండా ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీరామనవమికి ముందు నాలుగు రోజులపాటు లాక్‌ డౌన్‌ పెట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం లాక్‌ డౌన్‌పై చర్చించనున్నట్లు తెలిసింది. దీంతోపాటు వైద్యశాఖ, ఆలయ అధికారులు దేవాదాయశాఖ కమిషనర్‌కు లాక్‌ డౌన్‌పై సమాచారం అందించినట్లు- తెలిసింది. ఏదిఏమైనప్పటికీ రాజన్న క్షేత్రం, పరిసర ప్రాంతాల్లో కేసులు వేగంగా పెరుగుతూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. వేములవాడ రూరల్‌ మండలం మల్లారం గ్రామంలో ఒకే రోజు 31 కేసులు, వేములవాడ పట్టణాన్ని ఆనుకొని ఉన్న జయవరం గ్రామంలో ఒకేరోజు సుమారు 60 కేసులు, వేములవాడ పట్టణంలో గత మూడు రోజుల్లో సుమారు 100 కేసులు నమోదు కావడంతో పరిస్థితులు భయాందోళనకరంగా మారాయి. ప్రస్తుత భయానక పరిస్థితులను బట్టి అధికారులు లాభం విధిస్తారా లేక రాత్రి పూట పరిచయం విధిస్తారా వేచి చూద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement