Tuesday, November 26, 2024

TG: బాల కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..

వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వండి..
రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌
గోదావరి ఖని, జులై 2 (ప్రభన్యూస్‌): బాల కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, బాల కార్మికుల వివరాలు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జూలై 1 నుండి 31 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్‌ ముస్కాన్‌- ఎక్స్‌ నిర్వహణపై రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్‌ అధ్యక్షతన మంగళవారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ఆపరేషన్‌ ముస్కాన్‌- ఎక్స్‌ టీమ్‌ పోలీస్‌ అధికారులు, సిబ్బంది, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, లేబర్‌ డిపార్ట్ మెంట్, ఎడ్యుకేషన్‌ డిపార్ట్ మెంట్, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ డిపార్ట్ మెంట్, హెల్త్‌ డిపార్ట్ మెంట్, వివిధ డిపార్ట్ మెంట్ల‌ అధికారులతో సీపీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… గతంలో నమోదైన కేసుల డేటా ఆధారంగా పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తున్న హాట్‌ స్పాట్స్‌పై నిఘా ఉంచాలన్నారు. గతంలో రెస్క్యూ చేసిన పిల్లల పరిస్థితిపై అడిగి తెలుసుకోవాలన్నారు. స్కూల్‌ డ్రాప్‌ అవుట్‌ పిల్లలను గుర్తించి వారిని మళ్లీ స్కూల్లో చేర్పించాలన్నారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేని పిల్లలను గుర్తించి వారిని సంబంధిత హాస్పిటల్లో చేర్పించి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందేలా చూడాలన్నారు. ప్రతి దుకాణం వద్ద ”నో చైల్డ్‌ లేబర్‌ ఆర్‌ ఎంప్లాయిడ్‌ హియర్‌” బోర్డ్స్‌ ఏర్పాటు చేయించాలన్నారు. బాల్య వివాహాలు చేయడం నేరమని, బాల్య వివాహలపై అవగాహన కల్పించాలన్నారు. 18 ఏళ్లలోపు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు గొర్రెల, పశువుల కాపరులుగా, కిరాణం షాప్‌ లలో, మెకానిక్‌ షాపులలో, హోటళ్లలో, ఇటుక బట్టీల్లో, పౌల్ట్రీ ఫామ్‌లలో పనిచేసినా, పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్నా, మరే ఇతర ప్రదేశాలలో తప్పిపోయినా, వదిలివెయబడిన పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్నా వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్‌ హోమ్‌కు పంపించడం చేయాలన్నారు.

వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుండి విడిపోయిన, తప్పిపోయిన, గుర్తించబడని పిల్లలను గుర్తించడానికి ‘దర్పణ్‌’ అనే ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాప్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా భిక్షాటన, వెట్టి చాకిరీ చేయించినా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌- ఎక్స్‌లో భాగంగా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రతి డివిజన్‌ పరిధిలో ఒక ఎస్‌ఐ, నలుగురు సిబ్బందిని నియమించామని తెలిపారు. వీరితో పాటు వివిధ డిపార్ట్ మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు.

- Advertisement -

వివిధ డిపార్ట్ మెంట్ అధికారులంద‌రూ కలిసి సమిష్టిగా ఆపరేషన్‌ ముస్కాన్‌- ఎక్స్‌ నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్నా, లేక వారితో బలవంతంగా పని చేయించినా, తప్పిపోయిన, వదిలివేయబడిన, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు 1098 లేదా డయల్‌ 100, స్థానిక పోలీస్‌ అధికారులకు సమాచారం అందించాలని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్‌ డిసిపి అడ్మిన్‌ రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, సిసిఎస్‌ ఏసీపీ వెంకటస్వామి, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ పెద్దపల్లి చైర్మన్‌ శ్రీధర్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మంచిర్యాల చైర్మన్‌ వహీద్‌, మంచిర్యాల డీడబ్ల్యుఓ చిన్నయ్య, మంచిర్యాల డీఎంహెచ్‌ఓ వినీత, పెద్దపల్లి డిప్యూటి డీఎంహెచ్‌ఓ కృపాబాయి, ఇతర శాఖల అధికారులు, ఆపరేషన్‌ ముస్కాన్ టీం పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement