సిరిసిల్ల, జనవరి 28 (ఆంధ్రప్రభ): రౌడీషీటర్ మోయిజ్పై ఆరునెలల పాటు జిల్లాలో బహిష్కరణ విధించామని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ కనిపించినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు.
మంగళవారం సీఐ మీడియాతో మాట్లాడుతూ… సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 11కేసుల్లో నిందితుడిగా ఉండి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న రౌడీషీటర్ మహమ్మద్ మోయిజ్ పాషా అలియాస్ మోయిజ్ అనే వ్యక్తిని జిల్లా నుండి ఆరు నెలలు బహిష్కరించినట్లు వివరించారు. మోయిజ్ జిల్లాలో ఎక్కడైనా కనపడితే పోలీస్ వారికి సమాచారం అందించాలని తెలిపారు.
సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్ కి చెందిన మోయిజ్ పట్టణ పోలీస్ స్టేషన్ లో 11 (హత్య, హత్యాయత్నం, ఆర్మ్స్ యాక్ట్, బెదిరింపులకు పాల్పడిన, యూట్యూబ్ చానల్ వేదికగా వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టడం) కేసుల్లో నిందితునిగా ఉన్నాడని వివరించారు.
తనపై రౌడీ షీట్ ఉన్నపటికీ చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజాశాంతికి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగిస్తున్నాడని వస్తున్న ఫిర్యాదుల మేరకు అతనిపై తెలంగాణ సామాజిక వ్యతిరేక, ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం కింద- 1980 ప్రకారం జిల్లా నుండి ఆరు నెలల పాటు బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా కనపడినా అతని సమాచారం పోలీస్ వారికి అందించాలని సీఐ తెలిపారు. జిల్లాలో అసాంఘీక, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజాశాంతికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.