సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి వారు సమాజానికి అందించిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే) సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో స్మృతి పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ పోలీసు అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు. దేశ సరిహద్దుల్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో పహార కాస్తున్న 10 మంది సిఆర్పిఎఫ్ పోలీసులను 1959లో ఇదే రోజున చైనా దేశానికి చెందిన సైనికులు హతమార్చారని, అప్పటి నుండి వారి త్యాగాలను స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం జరుపుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు.
విధి నిర్వహణ సందర్భంగా ఎన్నో జటిలమైన సవాళ్లు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 48 మంది పోలీసులు అసాంఘిక శక్తులపై జరిపిన పోరులో ప్రాణత్యాగం చేశారని వివరించారు. పోలీసు అమరవీరుల కుటు-ంబాల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. గత 2021 అక్టోబర్ నుండి ఈ సంవత్సరం ఆగస్టు ఒకటి వరకు దేశవ్యాప్తంగా ప్రాణాలర్పించిన 264 మంది పోలీసుల పేర్లను ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ (పరిపాల) జి.చంద్రమోహన్ చదివి వినిపించారు. అమరవీరుల స్మారక స్థూపం వద్ద అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు, అమరవీరుల కుటు-ంబాలకు చెందిన సభ్యులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు) జి చంద్రమోహన్ (పరిపాల) ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, సత్యనారాయణ, కాశయ్య, వెంకటరెడ్డి, విజయ్ కుమార్, ప్రతాప్, ఎస్బిఐ జి.వెంకటేశ్వర్లతో పాటు-గా పలువురు పోలీసు అధికారులు, పోలీసు అమరవీరుల కుటు-ంబాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు.