Wednesday, November 20, 2024

KNR: ఉపాధి కోల్పోయిన కార్మికులకు.. తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలి..

సిరిసిల్ల, మార్చి 26 (ప్రభన్యూస్) : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న ఉపాధి సమస్యలను పరిష్కరిస్తూ మూడు నెలలుగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు తక్షణ సాయంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం రాస్తూ సంతకాల సేకరణ ప్రారంభించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత మూడు నెలల నుండి ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న పవర్ లూమ్, అనుబంధ రంగాల కార్మికులందరికీ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ. 10వేలు అందించి ఆదుకోవాలని, అలాగే పవర్లూమ్ కార్మికులకు రావలసిన బతుకమ్మ చీరల పెండింగ్ 10శాతం సబ్సిడీని వెంటనే అందించాలని, వస్త్ర పరిశ్రమంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి వెంటనే అందరికీ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మంగళవారం సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్, అనుబంధ రంగాల వార్పిన్, వైపని యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం రాసి కార్మికుల సంతకాల సేకరణ కార్యక్రమాలను చేపట్టారు.

అనంతరం కార్మికులందరితో సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం వద్దకు వెళ్లి వస్త్ర పరిశ్రమ యజమానులను కలిసి నెలల తరబడి పరిశ్రమలను బందు పెట్టడం వలన కార్మికులు పనిలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పని ప్రారంభించాలని, లేనిపక్షంలో కార్మికులందరికీ ఖర్చుల నిమిత్తం ప్రతి కార్మికునికి వారానికి రూ.10వేల చొప్పున అందించాలని లేఖను అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు తెలంగాణ పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ… సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన యజమానులు పరిశ్రమలను బందు పెట్టడం మూలంగా వస్త్ర పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్న వేలాదిమంది పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములు గత మూడు నెలల నుండి పనిలేక అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమలు నెలకొన్న సమస్యలను పరిష్కరించి అందరికీ కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో అధికారులకు, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లిన కూడా సమస్యను పరిష్కరించడం లేదన్నారు.

ఒకవైపు కార్మికులకు చేద్దామంటే పనిలేక మరో వైపు అప్పులు ఇచ్చేవారు కూడా లేక కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడి కార్మికులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ మనస్థాపానికి గురవుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఉపాధి కోల్పోయిన పవర్ లూమ్, అనుబంధ కార్మికులందరికీ తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలని కోరారు. అలాగే పవర్లమ్ కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ పెండింగ్ బకాయిలను అందించాలని, అదేవిధంగా వస్త్ర పరిశ్రమంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అందరికీ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రాబోయే పార్లమెంటు ఎన్నికలలో అన్ని పార్టీల నాయకుల ప్రచారాలు, సభలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

పవర్ లూమ్ అనుబంధ రంగాల కార్మికులందరూ రేపటి నుండి ఉదయం 9 గంటల వరకు బివై నగర్ లోని షాదీఖానా వెనక గల భద్రావతీ సొసైటీ వద్దకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్లె సత్యం, వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరి కుంట కిషన్, నాయకులు ఉడుత రవి, నక్క దేవదాస్, గుండు రమేష్, ఆడేపు సంపత్, ఒగ్గు గణేష్, ఎలిగేటి శ్రీనివాస్, మచ్చ వేణు, సబ్బని చంద్రకాంత్, మోర తిరుపతి, బెజుగం సురేష్, గోరంతల రాజమల్లు, వేణు, హరిదాస్, సదానందం, ప్రవీణ్, విజయ్, శ్రీధర్, శ్రీనివాస్, ప్రసాద్, రవీందర్, పోచమల్లు వవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement