Friday, November 22, 2024

TS | కరీంనగర్ లో 20 మంది అభ్యర్థుల నామినేషన్ల‌ తిరస్కరణ

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తైంది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థులు, వారి తరఫున హాజరైన ప్రతినిధుల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

కాగా, పార్లమెంటు స్థానానికి మొత్తం 53 మంది అభ్యర్థులు 94 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో వివరాలు సరిగా లేని 20 మంది నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. 33 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్లు పేర్కొన్నారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ను తిరిగి చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఎందుకు నామినేషన్ తిరస్కరణకు గురైందో అందుకు సంబంధించిన వివరాలను కూడా అభ్యర్థులకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఎవరైనా అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం శనివారం, ఆదివారం సెలవు ఉంటుందని… సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల్లోగా నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement