ఉమ్మడి కరీంనగర్, ప్రభన్యూస్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. ప్రధానంగా పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్లలో కుండపోత పోయగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై, ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. వాగులు, వంకలు పారుతుండగా, చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. అటు కడెం గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లికి ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో 20గేట్లు ఎత్తి దిగువకు పార్వతీ బ్యారేజ్‌లోకి నీటిని విడుదల చేస్తున్నారు. పార్వతీ బ్యారేజ్‌కు ప్రవాహం పెరగడంతో 50గేట్లు- ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అటు మానేరు వాగుకు వరద ప్రవాహం పెరిగింది. ధర్మపురి, కమ్మునూర్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సిరిసిల్ల జిల్లాలో వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంతటా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఎడతెరిపిలేకుండా వాన కురిసింది.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో అత్యధికంగా 22.63, ఇదే జిల్లా మల్యాలపల్లిలో 17.98, పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్ పూర్‌లో 16.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7.81, పెద్దపల్లి జిల్లాలో 11.21, కరీంనగర్‌లో 6.58, జగిత్యాల జిల్లాలో 9.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8-30 గంటల నుంచి సాయంత్రం వరకు పద్దపల్లి జిల్లా పాల్తెంలో 9.93, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 6.85, మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో 5.03, శ్రీరాంపూర్ మండలం కూనారంలో 5. జమ్మికుంట మండలం ధర్మారంలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్, కరీంనగర్, జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరేంజ్ హెచ్చరిక జారీ చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే ఇండ్ల నుంచి బయటికి రావాలని సీఎం సూచించడంతో ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు లోతట్టు ప్రాంతాలను, వరద ప్రవాహక ప్రాంతాలలో పర్యటించి అప్రమత్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఓసీపీలోకి వరద నీరు ప్రవహించడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది, 60వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జగిత్యాల, ధర్మపురి రహధారిపై అనంతారం వాగు, సారంగాపూర్ రహదారిపై కొనాపూర్ పెగడపల్లి మండలం వెదురుగట్ట, మేడిపల్లి మండలం ఒడ్డెరవాగు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు, కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి, సూరాంపేట, రాయికల్ మండలంలో రహదారుల వెంట ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల వద్ద ఉన్న పార్వతీ బ్యారేజీకి వరద పెరిగింది. బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టం 8.83 టీఎంసీలకు చేరింది.
కరీంనగర్ జిల్లాలోని ఎల్‌ఎమ్‌డికి ఇన్ పెరిగింది. ఎగువ నుండి 1899 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా కాకతీయ కెనాల్ ద్వారా 232క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలతో కరీంనగర్ నగరంతోపాటు పలు ప్రాంతాలు జలమయమైనాయి. పలు చోట్ల స్మార్ట్ సిటీ రోడ్లపై వరద పొంగి ప్రవహించింది. రాజన్న సిరిసిల్లజిల్లాలో మూలవాడు జోరుగా ప్రవహిస్తోంది. ఇల్లంతకుంట మండలం పొత్తూరు, నందికొట్కూరుల మధ్య సుద్దవాగు ప్రవాహానికి రహదారి తెగిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి(45) శుక్రవారం అర్ధరాత్రి చెరువులో చేపల వేటకు వెళ్లి వలను చెరువులో వేసి అటు ఇటు తిప్పు తుండగా ప్రమాదవశాత్తు కాళ్లకు తట్టుకొని రవి చెరువులో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. మిడ్‌మానేరు, ఎగువ మానేరులోకి వరద నీరు భారీ వర్షాలతో జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి 9595 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 27.5 టీ-ఎంసీల సామర్థం ఉన్న ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 7.50 టీ-ఎంసీల మేర నీటి నిల్వ ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.