పెద్దపల్లిరూరల్: ప్రయాణికులు, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆటోలకు క్యూ ఆర్ కోడ్, యూనిక్ నంబర్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా పలు ఆటోలకు డీసీపీ రవీందర్ ఈ కోడ్ స్టిక్కర్లను అంటించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 1300 ఆటోలకు ఈ కోడ్‌ను కేటాయించినట్లు తెలిపారు. ఆటోలలో ప్రయాణించే వారి భద్రత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ప్రయాణికులు, మహిళల భద్రతలో మరో అడుగు ముందుకు వేశామన్నారు. రక్షణ కోసం క్యూ ఆర్ కోడ్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఆటో వాలాలు పక్కాగా ఈ కోడ్‌ను వినియోగించాలని ఆదేశించారు. ఆటో నంబరుతోపాటు వాహనదారులకు సంబంధించిన పూర్తి వివరాలను క్రోడీకరించి క్యూ ఆర్ కోడ్‌ను అందించినట్లు తెలిపారు. ఆటో వాలాలు సీటు వెనక భాగంలో ప్రయాణికులకు కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు రిజిస్ట్రేషన్, వాహన పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికులు ఆటోలలో ప్రయాణించే సమయంలో క్యూ ఆర్ కోడ్ ఆధారంగా పోలీసులకు సమాచారం అందించే అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న వారు క్యూ ఆర్ కోడ్ స్కానర్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, వాహనాలలో ఎక్కే ముందు డిజిటల్ బోర్డు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో యజమాని వివరాలు తెలుస్తాయన్నారు. ప్రయాణ సమయంలో ఏదేని ఇబ్బందులు తలెత్తినా క్యూ ఆర్ కోడ్ ఆధారంగా పోలీసులకు పక్కా సమాచారం అందుతుందని, ప్రయాణికుల భద్రతకు భరోసానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నిఖిత పంత్, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, పెద్దపల్లి ఎస్సై రాజేష్ ట్రాఫిక్ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement