Sunday, November 24, 2024

అకాల వర్షం.. తడిసిన ధాన్యం.. నేలవాలిన పొలాలు

కోరుట్ల రూరల్ : మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసింది. పలుచోట్ల పండిన వరి పొలాలు నేల వాలాయి. మామిడి కాయలు రాలిపోగా.. పలుచోట్ల ఈదురు గాలులకు మామిడి చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో బుధవారం ఉదయం నుంచే కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని ఆరబెట్టే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మామిడికాయలు రాలి చెట్లు విరిగి పడటంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. మండలంలో ఈ రబీ సీజన్లో 7,200 ఎకరాల్లో వరి సాగు చేశారు. దొడ్డు రకాలు 90 శాతం వరి కోతలు పూర్తికాగా సన్న రకాలు మరో 50 శాతం కోతకు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు టార్పాలిన్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
నివేదిక సిద్ధం చేసి పంపుతాం : నాగమణి, మండల వ్యవసాయ అధికారి
మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరిధాన్యం తడిచింది. అదేవిధంగా పలుచోట్ల పొలాలు నేల వాలినట్టు గుర్తించాం. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేస్తాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement