Tuesday, November 19, 2024

యువతకు అందుబాటులో ఆట స్థలాలు.. వినోద్ కుమార్

రాష్ట్రంలోని గ్రామాల్లో, పట్టణాలలో యువతకు అందుబాటులో ఆట స్థలాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో గ్రామీణ క్రీడ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో చేపట్టిన పనులు మంచి ఫలితాలను అందించాయన్నారు. గతంలో నర్సరీలు కేవలం పెద్ద పట్టణాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవని, పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసామన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం శాతం పెరిగిందని, ఐక్యరాజ్య సమితి సైతం శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాలలో పెరిగిన పచ్చదనం చేద్దాం స్పష్టంగా తెలిసిందన్నారు.


గ్రామీణ ప్రాంతాల్లోని యువతను క్రీడల దిశగా ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఎకరం విస్తీర్ణంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణాల్లోని వార్డులో సైతం క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, చైనా, రష్యా, జర్మనీ దేశాలు క్రీడలపై అధిక శ్రద్ధ చూపుతాయన్నారు. రాబోయే 20 సంవత్సరాల్లో భారతదేశంలో ఒలింపిక్స్ జరుగుతాయని, వాటిలో భారతదేశానికి అధిక సంఖ్యలో పతకాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న గ్రామీణ క్రీడా ప్రాణాలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని, గ్రామాల్లో ఆసక్తిగల యువతను క్రీడల దిశగా ప్రోత్సహించాలని ఆయన ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు కాటారి రేవతి, ఈద శంకర్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపి.పి.బాలాజీ రావు, డిఆర్.డి.ఓ.శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement